రైలు కింద పడి యువకుడి బలవన్మరణం
బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి: రైలు కింద పడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి బీబీనగర్ మండల కేంద్ర పరిధిలోని ఎయిమ్స్ ఎదురుగా రైల్వే ట్రాక్‌పై జరిగింది. రైల్వే జీఆర్‌పీ ఇన్‌చార్జి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు వస్పరి వెంకటేశ్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు అభిలాష్(19) సంతానం. అభిలాష్ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రోజుమాదిరిగా బుధవారం కళాశాలకు వెళ్లి వచ్చిన అభిలాష్ అర్ధరాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కారు తీసుకొని బయటకు వచ్చాడు. బీబీనగర్ ఎయిమ్స్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన సర్వీస్ రోడ్డులో కారును నిలిపి ట్రాక్‌పై చేరుకొని ఎదురుగా వస్తున్న మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అందులోని సిమ్ తీసి వేరే మొబైల్‌లో వేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
అంతమ్మగూడెంలో విషాదఛాయలు
అభిలాష్ మృతితో అంతమ్మగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే ముందు అభిలాష్ తన చిన్న సోదరికి ఫోన్‌కు తన మెడలో బంగారు చైన్ ఉందని, అలాగే కొందరు స్నేహితులు డబ్బులు ఇవ్వాలని మెసేజ్ పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం స్వగ్రామంలో అభిలాష్ అంత్యక్రియలు నిర్వహించారు. చేతికందొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు ఆత్యహత్య చేసుకోవడంతో అభిలాష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అభిలాష్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.


