పేద కుటుంబానికి పెద్ద కష్టం
నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం
మఠంపల్లి: ఆ కుటుంబాన్ని విధి వంచించింది. కుటుంబ పెద్దతో పాటు అతడి ఇద్దరు కుమారులు వివిధ రకాల జబ్బులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంచానికే పరిమితమయ్యారు. వైద్య ఖర్చుల కోసం దాతలు సాయం చేయాలని ఆ ఇంటి మహిళలు కోరుతున్నారు. వివరాలు.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన తవిడబోయిన చంద్రయ్య(50)కు ఐదేళ్ల క్రితం పక్షవాతం రావడంతో చికిత్స చేయించుకుంటూ మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అప్పటి నుంచి అతడి పెద్ద కుమారుడు వీరబాబు(30) కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నాడు. అయితే గత మూడేళ్లుగా వీరబాబు కూడా కిడ్నీ, లివర్ జబ్బుతో మంచానికే పరిమితమయ్యాడు. అంతేకాకుండా పాఠశాలకు వెళ్లి చదువుకునే చంద్రయ్య చిన్న కుమారుడు గోపాలకృష్ణ(11)కు కూడా ఏడాది క్రితం మెదడు సంబంధిత వ్యాధి సోకింది. దీంతో చంద్రయ్య భార్య సైదమ్మ, పెద్ద కుమారుడు వీరబాబు భార్య సంధ్య అతి కష్టం మీద కుటుంబ భారాన్ని మోస్తూ వారికి వైద్య చికిత్స చేయిస్తున్నారు. చంద్రయ్య, వీరబాబు ఖమ్మంలోని ప్రశాంతి ఆస్పత్రిలో, చిన్న కుమారుడు గోపాలకృష్ణకు నల్లగొండలోని ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం వారికి ఉన్న కొద్దిపాటి ఆస్తిపాస్తులు కూడా అమ్ముకోవడంతో కుటుంబం పోషణ భారంగా మారింది. వైద్యానికి అయ్యే ఖర్చు భరించలేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దయార్ధ హృదయులు ఎవరైనా ఉంటే తమకు ఆర్థిక సాయం అందజేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రయ్య భార్య సైదమ్మ, కోడలు సంధ్య కోరుతున్నారు.
మా కుటుంబంలో మగవాళ్లందరు అనారోగ్య కారణాలతో ఇంటికే పరి మితమయ్యారు. దీంతో గత ఐదేళ్లుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. కుటుంబ పోషణకు, వైద్యం చేయించడానికి నేను, నా కోడలు మా శక్తినంతా దారపోస్తున్నాం. ప్రసుత్తం దిక్కులేకుండా అయ్యాం. మమ్ములను దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలి.
– తవిడబోయిన సైదమ్మ, చంద్రయ్య భార్య
ఫ అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తండ్రి, ఇద్దరు కుమారులు
ఫ వైద్యం చేయించడానికి
డబ్బులు లేక ఇబ్బందులు
ఫ దాతల సాయం కోసం ఎదురుచూపులు
పేద కుటుంబానికి పెద్ద కష్టం


