పవర్ హౌస్ టెయిల్ రేస్‌ను పరిశీలించిన జెన్‌కో డైరెక్ట
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం టెయిల్ రేస్‌ను బుధవారం జెన్‌కో సివిల్ డైరెక్టర్ అజయ్ సందర్శించారు. వ్యాప్‌కో సంస్థ కొన్ని రోజుల క్రితం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దిగువ భాగాన నీటి ప్రవాహం సాఫీగా వెళ్లే విధంగా ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రివర్స్ పంపింగ్ జరిగే తరుణంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు గాను చేపట్టాల్సిన చర్యల నివేదికను జెన్‌కో అధికారులకు అందించారు. ఈ సందర్భంగా జెన్‌కో సివిల్ డైరెక్టర్ అజయ్ ఆధ్వర్యంలో పవర్ హౌస్ టెయిల్ రేస్ ప్రాంతాన్ని సందర్శించి చేపట్టవల్సిన పనుల గురించి అధికారులకు సూచించారు. ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దిగువ భాగాన భారీగా రాళ్లగుట్టలు ఉన్నందున విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విడుదలైన నీటి ప్రవాహానికి ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా పవర్‌హౌస్‌లో రివర్స్ పంపింగ్ జరిగే ప్రక్రియలో అడ్డంకులు కూడా ఉత్పన్నమవుతుండటంతో పవర్ హౌస్ దిగువ భాగాన ఉన్న రాళ్ల గుట్టలను తొలగించనున్నారు. త్వరలోనే వీటికి సంబంధించిన పనులను ప్రారంభంచనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట సాగర్ జెన్‌కో సీఈలు మంగేష్‌కుమార్, నారాయణ, ఎస్‌ఈలు రఘురాం, రామకృష్ణారెడ్డి, డీఈలు, ఏఈలు ఉన్నారు.


