ఎడమ కాల్వ పవర్‌హౌస్ లక్ష్యం చేరింది
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం ఎడమ కాల్వ పవర్ హౌజ్‌లో విద్యుత్ ఉత్పత్తిలో కేటాయించిన లక్ష్యాన్ని ముందుగానే చేరుకున్నట్లు జెన్‌కో చీఫ్ ఇంజనీర్ మంగేష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం నాగార్జునసాగర్ జెన్‌కో కార్యాలయంలో ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నిర్ణయించిన లక్ష్యాన్ని ముందుగానే చేరుకున్న సందర్భంగా కేట్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ ప్రాజెక్టు ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 2025–26 విద్యుత్ సంవత్సరానికి గాను 70 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల ద్వారా మంగళవారం రాత్రి తమ లక్ష్యాన్ని అధిగమించినట్లు తెలిపారు. కాగా ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనలో 1450 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని రెండు వారాల క్రితమే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో డైరెక్టర్ అజయ్, హైడల్ చీఫ్ ఇంజనీర్ నారాయణ, జెన్‌కో ఎస్‌ఈలు రామకృష్ణారెడ్డి, రఘురాం, లెఫ్ట్ కెనాల్ పవర్ హౌజ్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


