బ్రెయిన్ డెడ్ .. యువకుడి అవయవాలు దానం
నార్కట్‌పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను అతడి తల్లిదండ్రుల దానం చేశారు. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన నడింపల్లి సత్యనారాయణ, హేమలత దంపతులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సత్యనారాయణ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల సొంతూళ్లో ఇల్లు కట్టుకుందామని నిర్ణయించుకొని బేస్ మెంట్ వరకు పనులు చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు శ్రీహర్ష(18) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద గల బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం, రెండో కుమారుడు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ నెల 17న పెద్ద కుమారుడు శ్రీహర్ష కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీహర్షను ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజులు చికిత్స పొందిన శ్రీహర్ష మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఇంత బాధలోనూ తమ కుమారుడు మరణించినప్పటికీ మరో నలుగురికి ప్రాణం పోయాలనే ఉద్దేశంతో శ్రీహర్ష గుండె, కిడ్నీ, ఇతర అవయవాలను అతడి తల్లిదండ్రులు దానం చేశారు. నార్కట్‌పల్లిలో బుధవారం శ్రీహర్ష అంత్యక్రియలు నిర్వహించారు.


