భక్తుల దీపారాధన
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవారం భక్తులు దీపారాధన చేశారు. కార్తీక మాసం ప్రారంభం, స్వాతి నక్షత్రం కావడంతో స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వైకుంఠద్వారం వద్ద, కొండపైన శివాలయం, ఆలయ మాడ వీధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శివకేశవులు కొలువైన యాదగిరి క్షేత్రంలో కార్తీక మాసంలో దీపారాధన చేయడం ఎంతో పవిత్రమని భక్తుల విశ్వాసం. దీంతో ఈ మాసమంతా ఆలయంలో భక్తులు కార్తీక దీపారాధనలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.


