వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
సూర్యాపేటటౌన్: హుజుర్‌నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి వెనుక నివాసముంటున్న చెన్న అనసూర్యమ్మ ఈ నెల 14వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హుజుర్‌నగర్‌కు చెందిన లింగం సతీష్ అనసూర్యమ్మ ఇంటికి అప్పుడప్పుడు వెళ్లి వస్తుంటాడు. వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నట్లు గమనించిన లింగం సతీష్ ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో సతీష్, అతని మేనల్లుడు(మైనర్ బాలుడు) ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి మద్యం మత్తులో అనసూర్యమ్మ ఇంటికి వెళ్లారు. లింగం సతీష్ ఆమె నోరు, ముక్కు చేతులతో మూయగా మైనర్ బాలుడు ఆమె రెండు కాళ్లను గట్టిగా పట్టుకుని ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనసూర్యమ్మ చనిపోయిందని గ్రహించిన వారు ఆమె చెవులకు ఉన్న బంగారు దిద్దులు, మాటీలు, ఆమె బొడ్డు సంచిలో గల బంగారు ఉంగరం, నాను తాడు(బనరు గొలుసు)లను దొంగిలించి, గతంలో సతీష్ ఆమె వద్ద అప్పుగా తీసుకున్న రూ.50,000కు సంబంధించిన ప్రామిసరీ నోట్‌ను కూడా బీరువాలో నుంచి అపహరించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో సతీష్ తన భార్య లింగం మౌనికకు చోరీ చేసిన సొత్తును చూపించి ఆమె సలహా ప్రకారం బంగారాన్ని విజయవాడ తీసుకెళ్లి అక్కడ కరిగించి తమ వద్ద ఉంచుకున్నారు. దర్యాప్తులో భాగంగా హుజూర్‌నగర్ పోలీసులు లింగం సతీష్, లింగం మౌనిక, మైనర్ బాలుడు ముగ్గురిని మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు ముద్ద, బంగారు కడ్డీ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదించిన హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు, కానిస్టేబుళ్లు డి. నాగరాజు, జి. శంభయ్యకు ఎస్పీ రివార్డు అందించి అభినందించారు.
ఫ రూ.3.60లక్షల విలువైన
బంగారం స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట
ఎస్పీ నరసింహ


