డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష, జరిమానా
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని బుధవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చగా.. అందులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.2000 జరిమానా, మరో నలుగురికి కలిపి రూ.4,000 జరిమానా విధిస్తూ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి పీవీ రమణ తీర్పు వెలురించినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆర్టీసీ బస్సుకు
తప్పిన ప్రమాదం
భూదాన్‌పోచంపల్లి: ఎదురుగా వచ్చే వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సు పంట పొలంలోకి ఒరిగిపోయింది. ఈ ఘటన బుధవారం ఉదయం భూదాన్‌పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల మధ్యలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పోచంపల్లి నుంచి వయా శివారెడ్డిగూడెం, ఇంద్రియాల, పెద్దరావులపల్లి గ్రామా ల మీదుగా భువనగిరికి వెళ్తోంది. ఈ క్రమంలో శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల మధ్య న ఇరుకు రోడ్డులో మరొక వాహనం ఎదురుగా రావడంతో దానికి దారిచ్చే క్రమంలో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లగా.. పక్కనే ఉన్న పంటపొలంలో దిగబడి బస్సు ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులంతా వెంటనే బస్సులో నుంచి కిందకు దిగారు. అనంతరం జేసీబీ సహాయంతో బస్సును పంట పొలంలో నుంచి బయటకు లాగారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్డంతా గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.


