‘ఫారన్’డాక్టర్లపై విచారణ
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఏడుగురు ఫారన్ మెడికల్ గ్రాడ్యుయేట్ల(ఎఫ్‌ఎంజీ)పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణ చేపట్టింది. విదేశీ యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు ప్రైవేట్ నర్సింగ్ హోంలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ మెడికల్ కౌన్సిళ్లు జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కాపీలు, వీసా, పాస్‌పోర్ట్, నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఢిల్లీ జారీ చేసిన స్క్రీనింగ్ టెస్ట్ సర్టిఫికెట్, విశ్వవిద్యాలయం జారీ చేసిన డిగ్రీ పట్టా తదితర సర్టిఫికెట్లను పూర్తిస్థాయిలో సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయా డాక్టర్లకు నోటీసులు జారీ చేసింది. వారంలోగా హెదరాబాద్‌లోని మెడికల్ కౌన్సిల్ చైర్మన్, రిజిస్ట్రార్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది.
వెలుగులోకి వచ్చిందిలా..
చైనా, టాంజానియా, జర్మనీ, ఉక్రెయిన్, పిలిఫ్‌పైన్స్, రష్యా, నేపాల్, కజకిస్తాన్, బెలారస్ దేశాల్లో పలు యూనివర్సిటీలు వైద్య విద్యను అందజేస్తున్నారు. కొందరు చదువుకోసం అక్కడికి వెళ్లకుండానే ఇక్కడి నుంచే సర్టిఫికెట్ పొందినట్లు తెలుస్తోంది. ఆర్టీఐ యాక్టివిస్టు ఒకరు ఎఫ్‌ఎంజీ వైద్యుల వివరాల సమాచారం కోసం దరఖాస్తు చేయగా.. నకిలీ వ్యవహారం వెలుగుచూసింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జిల్లాలో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. కొందరు తమ వద్ద ఉన్న సర్టిఫికెట్లను అందజేయగా.. మరికొందరు ఇవ్వలేదని తెలుస్తోంది. వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నర్సింగ్‌హోంల నిర్వహణ
విదేశీ యూనివర్సిటీలకు వెళ్లి చదవకుండానే డాక్టర్ సర్టిఫికెట్లు పొందిన వైద్యులు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు నర్సింగ్‌హోంలు నిర్వహిస్తున్నారు. వీరినుంచి వైద్యారోగ్యశాఖ అధికారులకు ముడుపులు ముడుతున్నాయని సమాచారం. పీహెచ్‌సీలలో అరకొరగా విధులు నిర్వహిస్తూ తమ సొంత నర్సింగ్ హోంలలో మాత్రం పూర్తిస్థాయి వైద్యం అందిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ హనుమంతరావు పలు పీహెచ్‌సీలను సందర్శించినప్పుడు అక్కడ వైద్యుల గైర్హాజరీని గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు.
ఫ జిల్లాలో ఏడుగురికి నోటీసులు
ఫ విచారణ చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్


