కార్తీక మాసం.. పరమ పవిత్రం
నేటి నుంచి ప్రారంభం
యాదగిరిగుట్ట: కార్తీక మాసాన్ని పవిత్రమైన మాసంగా భావిస్తారు. కార్తీక మాసం వ్రతాలకు, నోములకు, ఉపవాసాలకు, శుభకార్యాలకు ఎంతో ముఖ్యమైనది. ఈ మాసం ప్రారంభం నుంచి సూర్యోదయానికి పూర్వమే లేచి నది స్నానం ఆచరించి పొడి బట్టలతో దీపారాధన చేస్తారు. మహిళలు వ్రతాలు, నోములు ఆచరిస్తారు. తులసీ, మారేడు, ఉసిరికాయలతో శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో దీపాలు వెలిగించిన వారికి శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభమవుతుండటంతో మహిళలు ప్రత్యేక పూజలకు సిద్ధమయ్యారు. నవంబర్ 20వ తేదీ వరకు ప్రత్యేక పూజలు అందుకునేందుకు యాదగిరి క్షేత్రం, కొండపైన శివాలయంతో పాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో శివాలయాలు సిద్ధమయ్యాయి.
ఉసిరి చెట్టుకు పూజలు..
కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేస్తే విష్ణువుకు పూజ చేసినంత ఫలితం లభిస్తుందని భక్తులు భావిస్తారు. ఉసిరి కాయలు, ఆకులను నీటిలో వేసుకుని తల స్నానాలు ఆచరిస్తారు. ఉసిరికాయలు, ఆకుల్లో పోషక గుణాలు ఉండటంతో పాటు వాటితో స్నానం ఆచరిస్తే భక్తి, ముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. అదేవిధంగా స్నానాలాచరించే ముందు తిలామలక మిశ్రమాన్ని శరీరానికి లేపనం చేసుకుంటారు. ఆమలకం అంటే ఉసిరిక, తిలలు అంటే నువ్వులు ఈ రెండింటి మిశ్రమాన్ని రాసుకోవడం ద్వారా శరీర రుగ్మతులు నశించి ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరిక, నువ్వుల్లో ఆరోగ్య ప్రదాయకమైన ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుండడం వల్ల శరీరంపై కురుపులు, దద్దుర్లు, ఫంగస్ నశించడానికి ఈ స్నానం ఎంతో ఉపకరిస్తుంది.
వన భోజనాలు..
కార్తీక మాసంలో వన భోజనాలకు ప్రత్యేకత ఉంది. రావి, ఉసిరి, మామిడి, మారేడు వంటి చెట్ల కింద సామూహిక వన భోజనాలు చేస్తారు. కార్తీక మాసంలో నెల రోజులూ ఆలయాల్లో దీపాలు పెట్టడం సంప్రాదాయం. ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ద ద్వాదశి, చతుర్ధశి, పూర్ణిమ రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. శివాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం కడతారు. మూడు సిబ్బెలలో దీపాలు వెలిగించి ధ్వజ స్తంభం పైకి చేర్చుతారు. సాయంకాలం నువ్వుల నూనెతో ఆకాశ దీపారాధన చేస్తే రూప, సౌందర్య, సౌభాగ్య సంపదలు వృద్ధి చెందుతాయి.
కార్తీక సోమవారం వ్రతం
కార్తీక సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు పూజలు, అభిషేకాలు, దానాలు చేస్తే శివుడు తమ కోర్కెలు తీరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు. కార్తీక శుక్లపక్షం మొదటి రోజున మహిళలు బొమ్మల కొలువు, గోవర్ధనపూజ నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడిని బొమ్మగా తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు. రెండో రోజు భగిని హస్త భోజనం అనే పండుగను సోదరుల సంక్షేమం కోసం సోదరీమణులు నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. కార్తీక శుక్లపక్ష ఏకాదశిని విష్ణుభగవానుడి క్షీర సాగరంతో పూజలు జరుపుతారు.
ఫ నోములు, వ్రతాలకు ప్రత్యేక ప్రాధాన్యం


