మత్తు పదార్థాలు సేవిస్తున్న 17 మందిపై కేసు
నల్లగొండ: మత్తు పదార్థాలు సేవించడంతో పాటు విక్రయిస్తున్న ముఠాను, ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మెడికల్ షాపు యజమానిని సోమవారం తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బూరో సిబ్బంది, నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండకు చెందిన మహ్మద్ జబీఉల్లా, మహబూబ్‌బాద్ జిల్లా తొర్రూర్‌లోని వెంకటరమణ మెడికల్ షాపు యజమాని దారం కృష్ణసాయితో పాటు మత్తు కలిగించే స్పాస్మో టాబ్లెట్స్ సేవిస్తున్న 15 మందిని గుర్తించి అందులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సిబ్బంది, నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు మునుగోడు రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటుగా వెళ్తున్న మహ్మద్ జబీబ్‌ఉల్లా పోలీసులను చూసి పారిపోతుండగా అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని విచారించగా తాను ఫ్రిజ్ మెకానిక్ అని, గత ఐదేళ్లుగా మత్తు పదార్థాలకు బానిసైనట్లు ఒప్పుకున్నాడు. 2024లో కూడా అతనిపై 2 కేసులు నమోదై జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత తిరుమలగిరి దగ్గరలో ఉన్న ఒక మిల్లులో పనిచేశాడు. మూడు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని వెంకటరమణ మెడికల్ షాపు యజమాని దారంకృష్ణ సాయిని కలిసి ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు కలిగించే స్పాస్మో టాబ్లెట్స్ ఒక షీట్‌ను రూ. 100కు కొని నల్లగొండలో ఆ ట్లాబెట్లు వేసుకుంటున్న వారికి రూ.200కు అమ్మి లాభాం పొందవచ్చని పథకం వేశాడు. ఈ నెల 19న తొర్రూరు వెళ్లి 8 బాక్సులు(ఒక్కో బాక్సులో 18 షీట్లు) కొని మునుగోడులో ఉన్న అతడి స్నేహితుడు అఫ్రోజ్, అహ్మద్ అబ్దుల్ హఫీజ్ అలియాస్ ఖాజీం, ఓవైజ్, జావిద్, ఫెరోజ్‌కు ఒక్కొక్కరికి 8 షీట్లు అమ్మి మిగిలిన వాటిని నల్లగొండలో అమ్మడానికి బైక్‌పై వస్తుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మెడికల్ షాపు యజమానితో పాటు మరో ఐదుగురిని పట్టుకుని, మెడికల్ షాపును సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న టీజీఏఎన్‌బీ డీఎస్పీ భిక్షపతిరావు, నల్లగొండ వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, పోలీస్ సిబ్బందిని టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.
ఫ మెడికల్ షాపు సీజ్.. ఏడుగురి అరెస్ట్


