ఏటీఎం కేంద్రాలే టార్గెట్
ఇబ్రహీంపట్నం రూరల్: ఏటీఎం కేంద్రాలే టార్గెట్‌గా చేసుకుని అమాయకుల దృష్టి మళ్లించి నగదు మాయం చేస్తున్న కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో మహేశ్వర్ జోన్ డీసీసీ సునీతారెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా తాళ్లగడ్డ కాలనీకి చెందిన సుధనబోయిన వెంకటేశ్ (37) బతుకుదెరువు కోసం వలసవచ్చి నాగారంలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో అద్దెకు ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఏటీఎం కేంద్రాలను లక్ష్యం చేసుకున్నాడు. కార్డులు స్వైప్ చేస్తున్నట్లు నటిస్తూ వృద్ధులు, మహిళలు డబ్బు డ్రా చేసుకోవడానికి రావడం గమనిస్తాడు. డబ్బులు తీసిస్తానని వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న కార్డులు తీసుకుని దృష్టి మళ్లించి తన వద్ద ఉన్న డూప్లికేట్ కార్డు ఇచ్చేస్తాడు. ఆ కార్డు స్వైప్ చేసినట్లు నటించి రావడం లేదని చెబుతాడు. వారు వెళ్లగానే నగదు డ్రా చేసుకుంటాడు.
ఓ కేసు విచారణతో వెలుగులోకి..
11 సెప్టెంబర్ 2025న సాయినాథ్ మోహన్ రావు జోషి అనే వ్యక్తిని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ ఎస్‌బీఐ ఏటీఎం వద్ద దృష్టి మరల్చి రూ.40 వేల నగదు కాజేశాడు. బాధితుడు 15 సెప్టెంబర్ 2025న ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగించారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు అతనిపై 27 కేసులు ఉన్నట్లు తేలింది. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. 2021లో చర్లపల్లి జైలులో ఉన్నట్లు గుర్తించారు. 27 కేసుల్లో మొత్తం రూ.12,61,246 నగదు కాజేశాడు. నిందితుడి నుంచి రూ.6.31 లక్షల నగదు, సెల్‌ఫోన్, 23 వివిధ రకాల ఏటీఎం కార్డులు, ఓ కారును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఫ అమాయక వృద్ధులు, మహిళలే లక్ష్యం
ఫ దృష్టి మళ్లించి నగదు మాయం
ఫ అంతర్ రాష్ట్ర నేరగాడి అరెస్ట్
ఫ రూ.6.31 లక్షల నగదు, కారు,
ఏటీఎం కార్డులు స్వాధీనం


