వ్యవసాయబావిలో దూకి మహిళ బలవన్మరణం
రామన్నపేట: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ వ్యవసాయబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం రామన్నపేట మండలం దుబ్బాకలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక గ్రామానికి చెందిన జినుకుంట్ల సైదమ్మ(32)కు తొమ్మిది సంవత్సరాల క్రితం జానయ్యతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె సంతానం. సైదమ్మ గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గ్రామశివారులోని వ్యవసాయబావి వద్దకు వెళ్లి అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు సైదమ్మ కనిపించకపోవడంతో ఆమె కోసం ఊరంతా వెతికారు. వ్యవసాయబావి వద్ద ఆమె రాసిపెట్టిన సూసైడ్ లెటర్‌ను చూసి ఆమె బావిలో దూకినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఫైర్ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త జానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.


