
అప్రమత్తంగా ఉంటేనే ఆనంద కేళి..
పెద్దవూర: వెలుగులు విరజిమ్మే దీపావళి రానే వచ్చింది. పండుగ రోజున టపాసులు పేల్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆనందకేళీ అవుతుంది.
వ్యాపారులు పాటించాల్సిన
జాగ్రత్తలు
● టపాసుల దుకాణదారులు అధికా రుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.
● దుకాణాలను బహిరంగ మైదా నాలు, అధికారులు సూచించిన స్థలాల్లోనే ఉండాలి.
● దుకాణాల వద్ద ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకోవాలి.
● ప్రమాదాల నివారణకు నీటిని, ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి.
● వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి దుకాణదారుడు కరపత్రాలను అందజేయాలి.
● దుకాణానికి అనుమతి గడువు తీరిన అనంతరం టపాసులను సంబంధిత అధికారికి అప్పగించాలి.
కాల్చేటప్పుడు జాగ్రత్తలు
● అనుమతులు ఉన్న దుకాణాల్లోనే టపాసులను కొనుగోలు చేయాలి.
● పెద్దల సమక్షంలోనే చిన్న పిల్లల చేత పటాకులు కాల్పించాలి.
● టపాసులు కాల్చేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు, ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి.
● టపాసులు కాల్చే సమయంలో బిగుతుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
● పారపాటున దుస్తులకు నిప్పు అంటుకుంటే అటూ ఇటూ పరిగెత్తకుండా ఉన్న చోటే కింద పడుకుని దొర్లాలి. అలా చేయడం వలన నిప్పు త్వరగా ఆరిపోతుంది.
● ఇంట్లో కిరోసిన్, గ్యాస్ సిలిండర్ల వద్ద టపాసులను నిల్వ ఉంచకూడదు.
● సగం కాలిన టపాసులను మళ్లీ కాల్చే ప్రయత్నం చేయరాదు.
● బాణసంచా కాల్చిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
● టపాసులను సొంతంగా తయారు చేసే ప్రయత్నం చేయరాదు.
● బాణసంచా పేలుళ్ల వలన వినికిడి సమస్యతో పాటు అధిక రక్తపోటు, గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.
రసాయనాలు.. వాటి ప్రభావం..
చైనా టపాసుల్లో పొటాషియం క్లోరైడ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. వీటిని పేల్చగానే ఒకేసారి పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి మనిషిని అనారోగ్యం పాలు చేస్తుంది. టపాసుల్లో ఉపయోగించే రసాయనాలు పీల్చడం వలన కలిగే దుష్పలితాలు..
రాగి: శ్వాస నాళాల్లో మంట వస్తుంది.
కాడ్మియం: రక్తహీనత, మూత్రపిండాలు దెబ్బతింటాయి
సీసం: నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది
మెగ్నీషియం: మెగ్నీషియం ధూళి కారణంగా జ్వరం వస్తుంది.
సోడియం: చర్మవ్యాధులు వస్తాయి
జింక్: వాంతులు వస్తాయి
నైట్రేట్: మానసిక స్థితి అదుపు తప్పుతుంది.
టపాసులు కాల్చేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి