అత్యవసర సమయంలో 108కు కాల్ చేయాలి
భువనగిరి: దీపావళి పండుగ సందర్భంగా ఏవైనా ప్రమాదాలు సంభవించి అత్యవసర పరిస్థితి ఏర్పడితే 108 నంబర్‌కు కాల్ చేయాలని 108 ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ రాష్ట్ర కార్య నిర్వహణ అధికారి సుధాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టపాసులు కాల్చే క్రమంలో ప్రమాదాలు జరగడం, పొగకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు, అస్తమా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. 108 అంబులెన్స్‌లను 24 గంటలు సిద్ధంగా ఉంటాయన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ఆలేరురూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఆలేరులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. మార్క్‌ట్‌కు ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం విక్రయించిన రైతు కిష్టయ్యతో మాట్లాడి అధికారులు ఏమైనా ఇబ్బందులు పెట్టారా, కేంద్రంలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయని ఆరా తీశారు. రైతులు ఎవ్వరూ ధాన్యాన్ని ప్రైవేట్‌కు అమ్ముకోవద్దని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఆయన వెట తహసీల్దార్ ఆంజనేయులు ఉన్నారు.
హైవేపై వాహనాల రద్దీ
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారిపై శనివారం సాయంత్రం వాహనాల రద్దీ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల సాధనకోసం జరిగిన బంద్ కారణంగా ఉదయం నుంచి మధ్యాహం వరకు వాహనాలు పెద్దగా బయటకు రాలేదు. మధ్యాహ్నం తరువాత రాకపోకలు మొదలయ్యాయి. దీపావళి పండుగతో పాటు వరుస సెలవులు ఉండడంతో ప్రజానీకం సొంతూళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో సాయంత్రం సమయంలో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణంలో ఇరుమార్గాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో బారులుదీరాయి.
కోతుల బెడద
నివారణకు చర్యలు
ఆత్మకూరు(ఎం): మండలంలోని కూరెల్ల గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కోతులను.. పట్టి తరలించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కరీంనగర్ నంచి కోతులను పట్టే వాళ్లను పిలిపించారు. కోతికి రూ.300 చొప్పున చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఇంటికి రూ.1000 చొప్పున ఇవ్వాలని గ్రామస్తులు శనివారం సమావేశమై తీర్మానించారు. గ్రామంలో సుమారు 500 ఇళ్ల వరకు ఉంటాయి. డబ్బులు వసూలు చేసే బాధ్యతలను కులసంఘాలకు అప్పగించారు.
అత్యవసర సమయంలో 108కు కాల్ చేయాలి
అత్యవసర సమయంలో 108కు కాల్ చేయాలి


