విధేయత, కష్టపడే వారికే ప్రాధాన్యం
యాదగిరిగుట్ట రూరల్: పార్టీ కోసం కష్టపడి, సమన్వయంతో ముందుకు వెళ్లే వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కుతుందని ఏఐసీసీ పరీశీలకుడు శరత్‌రౌత్ పేర్కొన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక అన్ని డివిజన్లలోని కాంగ్రెస్ నాయకుల సలహాలు, సూచనల మేరకు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఎవరైతే బాధ్యతగా పనులు చేస్తూ, విధేయుడిగా పార్టీని నడిపిస్తున్నారో వారిని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని తెలి పారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఆరుగురి పేర్లను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపిస్తామని చెప్పారు. ఇందులో ఒకరిని హైకమాండ్ ఎంపిక చేస్తుందని తెలిపారు. అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ, పేర్ల పరిశీలన ఈ నెల 21 వరకు జరుగుతుందని, తదనంతరం ఫైనల్ రిపోర్టును అధిష్టానానికి పంపిస్తామన్నారు. పార్టీలో ఐదేళ్ల కన్నా ఎక్కువ పనిచేసి ఉండాలని, పార్టీ కోసం శ్రమించే వారికి డీసీసీ పదవి దక్కుతుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు ఇవ్వడానికి మేము సపోర్ట్ చేస్తామన్నారు.
అందరి అభిప్రాయం మేరకే ఎన్నిక : ఐలయ్య
పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకే జిల్లా అధ్యక్షుని ఎంపిక ఉంటుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గతంలో మాదిరిగా సిఫారసు లేఖలతో కాకుండా, పార్టీ నాయకుల అభిప్రాయాలను హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఎవరైనా పోటీలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఐనాల చైతన్యరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరిగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఏఐసీసీ పరిశీలకుడు శరత్‌రౌత్


