50 శాతం దాటొద్దని ఎక్కడుంది?
సాక్షి, యాదాద్రి : బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడుందని, ఇది నిజం కాదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. అన్ని పార్టీలను ఒక్కటి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెడితే కొందరు కుట్రపూరితంగా నోటికాడి బుక్కను గుంజుకుంటున్నారని విమర్శించారు. బంద్‌లో భాగంగా భువనగిరిలోని జగ్జీవన్‌రాం చౌరస్తాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేసి పంపిన బిల్లును గవర్నర్, రాష్ట్రపతి పెండింగ్‌లో పెట్టి నానుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు, నాయకులు కేంద్రంపై ఎందుకు వత్తిడి తేవడం లేదని ప్రఽశ్నించారు. రిజర్వేషన్లు ఎవరు ఇచ్చే భిక్ష కాదని, బీసీల హక్కు అన్నారు. వెయ్యి మంది బీసీలను ఢిల్లీకి తరలించి అక్కడ ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ శాఖ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, వివిధ పార్టీల నాయకులు తంగెళ్లపల్లి రవికుమార్, పోత్నక్‌ప్రమోద్‌కుమార్, అవైస్ చీస్తీ, సుర్వి శ్రీనివాస్‌గౌడ్, ఎండీ ఇమ్రాన్, కొత్త నర్సింహస్వామి, భట్టు రామచంద్రయ్య, ఎండీ అతహార్, ఎండీ రఫీ, కస్తూరిపాండు, సాబన్‌కార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


