
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
అడవిదేవులపల్లి : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అడవిదేవులపల్లి మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బాపన్‌బాయి తండాకు చెందిన సపావత్ రజిత (32)కు నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన రమావత్ ఆంజనేయులుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ఆంజనేయులు మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలను నడిపించేవాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా తరుచూ గొడవపడుతున్నారు. గురువారం రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అందరూ నిద్రిస్తున్న సమయంలో రాత్రి 10గంటల తరువాత రజిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్రమత్తులో నుంచి లేచిన ఆంజనేయులు భార్య ఉరివేసుకున్న విషయాన్ని గమనించి హుటాహుటిన మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి పరశురాములు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.