
కరెంట్ తీగలు తగిలి యువకుడు మృతి
కొండమల్లేపల్లి: పొలం వద్ద నేలపై పడి ఉన్న కరెంట్ తీగలు తగిలి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట్ల గ్రామానికి చెందిన జటమోని శ్రీను, వెంకటమ్మ దంపతుల పెద్ద కుమారుడు జటమోని వెంకటేష్(23) గురువారం ఉదయం తమ పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం గట్ల పైన నడుచుకుంటూ వెళ్తుండగా అప్పటికే నేలపై పడి ఉన్న విద్యుత్ తీగలు అతడి కాలుకు చుట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం వద్దకు వెళ్లిన వెంకటేష్ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పొలం వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. విద్యుత్ తీగలు నేలపై పడి ఉన్నాయని నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికి లైన్‌మన్, విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా..
వెంకటేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ అతడి బంధువులు, గ్రామస్తులు కొండమల్లేపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించారు. పోలీసులు, విద్యుత్ సబ్ స్టేషన్ అధికారులు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడి మరణంతో తల్లిదండ్రులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి
బంధువుల ఆరోపణ
కొండమల్లేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా

కరెంట్ తీగలు తగిలి యువకుడు మృతి