
నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై నుంచి జారిపడి మృతి
భూదాన్‌పోచంపల్లి: నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు పారిపల్లి కృష్ణారెడ్డి(55) గ్రామంలో నూతనంగా రెండంతస్తుల ఇంటిని నిర్మిస్తున్నాడు. గురువారం ఇంటి స్లాబ్‌కు క్యూరింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి భవనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు గమనించి చికిత్స నిమిత్తం కారులో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే కృష్ణారెడ్డి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య జయమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
మతిస్థిమితంలేని వ్యక్తి..
తిప్పర్తి: తిప్తర్తి మండలం చిన్నాయిగూడెం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితంలేని వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30ఏళ్ల వయస్సున్న మతిస్థిమితంలేని వ్యక్తి చిన్నాయిగూడెం వద్ద రోడ్డు దాటుతుండగా డీసీఎం వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం తిప్పర్తి పంచాయతీ కార్యదర్శి నర్సింహ స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్ తెలిపారు.
గల్లంతైన యువకుడి
మృతదేహం లభ్యం
చందంపేట: నేరెడుగొమ్ము మండలం వైజాక్ కాలనీలో కృష్ణా నది వెనుక జలాల్లో గల్లంతైన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన తిన్నారపు పృథ్వీరాజ్ మృతదేహం గురువారం లభ్యమైంది. పృథ్వీరాజ్ మంగళవారం స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీలో సరదాగా గడిపేందుకు వచ్చాడు. అదే రోజు ఈత కొట్టేందుకు గాను కృష్ణా నది వెనుక జలాల్లోకి దిగి గల్లంతు కాగా.. గాలింపు చర్యలు చేపట్టిన ఎస్‌ఎడీఆర్‌ఎఫ్ బృందాలకు రెండు రోజుల తర్వాత గురువారం మృతదేహం లభ్యమైంది.

నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై నుంచి జారిపడి మృతి