
కాంగ్రెస్‌కు కంచుకోట నల్లగొండ
● బిశ్వరంజన్ మహంతి
మునుగోడు: నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుందని ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బిశ్వరంజన్ మహంతి అన్నారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం గురువారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మంచి పేరు ఉన్న నాయకుడని, ఆయనకు మంత్రి పదవి చాలా చిన్నదన్నారు. ఆయనకు తగిన పదవి దక్కుతుందన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఆవేదన, కోరికను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా తాము పూర్తి మద్దతు ఇస్తామని రాజగోపాల్‌రెడ్డితో పాటు నియోజకవర్గ కార్యకర్తలు ఏకగ్రీవంగా అంగీకరించారు.