
కలెక్టరేట్‌లో ప్రజావాణి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలువురు వినతులు అందజేశారు. కలెక్టర్ హనుమంతరావు వినతులు స్వీకరించడంతో పాటు బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. తపాల శాఖ ద్వారా గుర్తింపు కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
మత్స్యగిరీశుడి హుండీ ఆదాయం రూ.11.93 లక్షలు
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు, ఇతర కానుకలను గురువారం లెక్కించారు. 114 రోజులకు నగదురూపంలో రూ.11,93,431 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ మో హన్‌బాబు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్‌రెడ్డి సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
సెల్లార్లను 31లోగా
ఖాళీ చేయాలి
భువనగిరిటౌన్ : సెల్లార్లలో ఏర్పాటు చేసిన దుకాణాలను ఈనెల 31లోపు ఖాళీ చేయాలని అనదపు కలెక్టర్ భాస్కర్‌రావు భవన యజ మానులను ఆదేశించారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని భవనాల యజమానులతో గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్లార్‌లను వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలకు వినియోగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే భవనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సెల్లార్లలో దుకాణాలు నిర్వహిస్తున్న వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జగదేవ్‌పూర్ చౌరస్తాలో ఉన్న జన్మభూమి మడిగెల్లో మున్సిపాలిటీ కేటాయించిన వారు మాత్రమే ఉండాలని, సబ్ లీజ్ దారులు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. సోమవారం లోపు మడిగెల యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. మడిగెల నుంచి మున్సిపాలిటీకి పూర్తిస్థాయిలో పన్ను రావడం లేదని, 115 షాపులకు గాను రూ.48.40 లక్షలు బకాయి ఉందని, వెంటనే వసూలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, సిబ్బంది పాల్గొన్నారు.
18 నుంచి జువైనల్
కేసుల విచారణ
భువనగిరిటౌన్ : జిల్లాలోని జువైనల్ కేసుల విచారణ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జువైనల్ కేసుల విచారణకు వారంలో ఒక రోజు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తిగా భువనగిరి అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ జడ్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. జువైనల్ జస్టిస్ బోర్డును భువనగిరిలోని పాత మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కొనుగోలు కేంద్రాల
సందర్శన
రామన్నపేట: రామన్నపేట మండలంలోని పల్లివాడ, కక్కిరేణి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి సందర్శించారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. వరి చేను పక్వానికి వచ్చిన తరువాతే కోత కోయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రైవేట్‌కు విక్రయించి నష్టపోవద్దని చెప్పారు. కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని కోరారు. రైతులకు అసౌకర్యం కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లాల్‌బహదూర్‌శాస్త్రి, పీఏసీఎస్ సీఈఓ జంగారెడ్డి ఉన్నారు.

కలెక్టరేట్‌లో ప్రజావాణి