
‘ఉపాధి హామీ’లో జలసంరక్షణ
వచ్చే ఏప్రిల్ నుంచి పనులు
ఆలేరు: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులకు జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా జలసంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు వాటిని సంరక్షించుకుంటే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి నుంచి గట్టెక్కవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఉపాధిహామీలో జలసంరక్షణ పనులు విరివిగా చేపట్టాలని సూచించింది. ఈ మేరకు అధికారులు పనులను గుర్తించారు.
నవంబర్ 30 వరకు గ్రామసభలు
జిల్లాలో 17 మండలాల పరిధిలో 428 గ్రామ పంచాయతీల్లో సుమారు 2.63 లక్షల ఉపాధి కూలీలు, 1.44 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఆయా మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 2026–27 సంవత్సరానికి గాను మొత్తం 58 రకాల పనులను చేపట్టనున్నారు. పనుల గుర్తింపునకు మండలాల వారీగా గ్రామాల్లో సభల నిర్వహణకు డీఆర్‌డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క మండలంలో పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా గ్రామ సభలను మూడు నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈనెలలో గ్రామ సభలు మొదలై నవంబర్ 30 తేదీ వరకు కొనసాగనున్నాయి. చేపట్టబోయే పనులను ప్రజల ఆమోదంతో గుర్తిస్తారు.
భూగర్భ నీటి మట్టం
పెంపు పనులకు ప్రాధాన్యం
కార్యాచరణ సిద్ధం చేసిన డీఆర్‌డీఏ
గ్రామసభల నిర్వహణకు సన్నాహాలు
ప్రజల ఆమోదంతో పనుల గుర్తింపు
వీటికి మొదటి ప్రాధాన్యం
అన్ని మండలాల్లో రెగ్యులర్ ఉపాధి పనులతోపాటు భూగర్భ జాలాల వృద్ధికి ఫాంపాడ్స్, మ్యాజిక్ సోప్ పిట్స్, కమ్యూనిటీ సోప్‌పిపట్స్, నీటి కుంటలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు, చెరువులు, కాల్వల్లో పూడికతీత వివిధ రకాల వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పనులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది.
గ్రామస్థాయిలో గుర్తించిన పనులను మండలానికి, అక్కడి నుంచి జిల్లాకు ప్రతిపాదనలు వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో బడ్జెట్ కేటాయింపు జరుగుతుంది.ఈప్రక్రియ తర్వాత వచ్చే ఏప్రిల్ నుంచి పనులు మొదలవుతాయి. జల సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాం. త్వరలో గ్రామసభలు ప్రారంభిస్తాం.
– నాగిరెడ్డి, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్

‘ఉపాధి హామీ’లో జలసంరక్షణ