
రూపాయికి బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డు
రామగిరి(నల్లగొండ): దీపావళి పండుగకు రూపాయికి బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డు ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. దీపావళి ప్రత్యేక పథకం ద్వారా ఒక్క రూపాయి ప్రీపెయిడ్ సిమ్‌కార్డుతో నెల రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ కొత్తగా ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వారికి, పోర్టబులిటీ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి మారే వారికి వర్తిస్తుందని తెలిపారు.
మహిళ అదృశ్యం
భువనగిరి: మండలంలోని వడాయిగూడెం గ్రామంలో మహిళ అదృశ్యమైంది. గ్రామానికి చెందిన బబ్బూరి శంకరయ్య బుధవారం ఉదయం 10.30 గంటలకు పని నిమిత్తం యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఇంట్లో భార్య ఉమారాణి కనిపించకపోవడంతో చుట్టపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య మానసికస్థితి సరిగా లేక కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.
జానకిపురంలో వ్యక్తి..
అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మయ్య (86) ఈనెల 13న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈమేరకు ఆయన కుమారుడు సోమయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రికి మతిస్థిమితం సరిగా లేదని తెలిపాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి తెలిపారు.
కొనసాగుతున్న గాలింపు
చందంపేట : నేరెడుగొమ్ము మండలం వైజాక్ కాలనీలోని కృష్ణా వెనుక జలాల్లో మంగళవారం యువకుడు గల్లంతు కాగా.. అతడి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన తిన్నారపు పృథ్వీరాజ్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు తన స్నేహితులతో కలిసి వైజాక్ కాలనీకి రాగా ఈత కోసం కృష్ణా వెనుక జలాల్లో దిగి గల్లంతయ్యాడు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పృథ్వీరాజ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేంద్రబాబు బుధవారం తెలిపారు.