
రాష్ట్ర హక్కులను కాపాడుతాం
కోదాడ: కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ఎంత వరకై నా వెళ్తామని ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కోదాడలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్‌ను ప్రతిపాదిస్తున్నదని తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర జలవనరులశాఖకు, కేంద్ర ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజేశామని అన్నారు. రాష్ట్ర నీటిపారుదశాఖ మంత్రి హోదాలో తాను న్యాయస్థానంలో హాజరయ్యానని తెలిపారు. ప్రజల్లో అపోహలు కలిగించడానికి ప్రతిపక్షనేతలు అసత్య ప్రచారాలను చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం 811 టీఎంసీలలో 299 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని ఒప్పుకుందన్నారు. తమ ప్రభుత్వం 811 టీఎంసీలలో తెలంగాణకు 70శాతం నీటివాటా కావాలని పోరాడుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని అందిస్తామని దీనికి ఇప్పటికే రూ.4300 కోట్లు కేటాయించామని తెలిపారు. సొరంగం తవ్వకంలో ప్రమాదం జరిగి పనులు ఆగిపోయాయని, దేశంలోనే ఉత్తమ సొరంగ నిపుణులను తీసుకొచ్చి పనులను ప్రారంభించడానికి కృషి చేస్తున్నామన్నారు. డిండి ప్రాజెక్ట్‌కు రూ.1800 కోట్లను కేటాయించి పనులు చేయబోతున్నామని తెలిపారు. గోదావరి జలాలను శ్రీరాంసాగర్ పేజ్–2 ద్వారా సూర్యాపేట జిల్లాకు తీసుకొస్తామని తెలిపారు. ఈ సంవత్సరం వానాకాలంలో రాష్ట్రంలో 67 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారని, 148. 8 లక్షల టన్నుల ధ్యానం పండబోతున్నదని, దీనిలో 87 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని వివరించారు. దీని కోసం 8432 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిలో అన్ని సౌకర్యాలను కల్పించామని తెలిపారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి