
పండుగలు, శుభకార్యాలకు వేళాయే..
యాదగిరిగుట్ట: హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహాది శుభకార్యాలకు అనువైన మాసం. శుక్రవారం నుంచి శ్రావణ మాసం మొదలై ఆగస్టు 22వ తేదీ వరకు కొనసాగనుంది. నెల రోజుల పాటు వరలక్ష్మీ అమ్మవారికి పూజలు చేయడంతో పాటు మహిళలు వ్రతాలు ఆచరిస్తారు. వివాహాలు, గృహ ప్రవేశాలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు, వ్యాపార ప్రారంభోత్సవాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు, విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలను ఈ మాసంలోనే అధికంగా నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు అందుకునేందుకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు ఇతర ఆలయాలు ముస్తాబవుతున్నాయి.
వరలక్ష్మీ వ్రతాలు.. బోనాల సందడి...
శ్రావణ మాసం అంటే మహిళలకు గుర్తుకొచ్చేవి వరలక్ష్మీ వ్రతాలు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజునే ప్రారంభం కావడం మరింత విశేషాన్ని సంతరించుకుంది. ఈ మాసంలో వచ్చే 3వ శుక్రవారం ఆగస్టు 8వ తేదీన మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఆ రోజున కుదరని వారు నాలుగు, ఐదు శుక్రవారాల్లో సైతం వ్రతాన్ని ఆచరించనున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో లక్ష్మీదేవితో పాటు అమ్మవార్ల దేవాలయాల్లో విశేష పూజలు, వ్రతాలు, సామూహిక కుంకుమార్చనలు వంటి పూజలుంటాయి. ఆషాఢంలో లష్కర్‌లో బోనాల జాతర ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో శ్రావణ మాసంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ఆనావాయితీగా వస్తుంది.
మొదలుకానున్న శుభ ముహుర్తాలు..
శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలను ప్రజలు వెతుకుతున్నారు. ఈ నెల 26, 30, 31, ఆగస్టు 1, 3, 4, 6, 8, 10, 13, 14, 17, 18 తేదీల్లో శుభకార్యాలు నిర్వహించేందుకు మంచి ముహుర్తాలు ఉన్నాయని అర్చకులు చెబుతున్నారు.
విశేష దినాలు ఇవే..
ఈ నెల 26 నుంచి 28వ తేదీ వదరకు శ్రీఆండాల్ అమ్మవారి తిరు నక్షత్ర ఉత్సవం యాదగిరి క్షేత్రంలో జరపనున్నారు. 29వ తేదీన నాగుల పంచమి, ఆగస్టు 1వ తేదీన యాదగిరీశుడి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ మరింత విశేషంగా నిర్వహిస్తారు. 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు జరిపిస్తారు. 5వ తేదీన ఏకాదశి, 8వ తేదీన వరలక్ష్మీ వ్రతం, 9వ తేదీన రాఖీ పూర్ణిమ, శ్రీగాయత్రీ జయంతి, హయగ్రీవ జయంతి వస్తుంది. 12వ తేదీన సంకష్టహర చతుర్ధీ వ్రతం, 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం, 16వ తేదీన స్మార్త శ్రీకృష్ణ జయంతి వంటి పండుగలు రానున్నాయి.
శ్రావణ మాసం పవిత్రమైనది
శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ మాసంలో 5 శుక్రవారాలు రావడం మరో విశేషం. నెల రోజుల పాటు మహిళలు అమ్మవారిని కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మాసంలోనే శుభకార్యాలకు మంచిగా భావించి, చాలా మంది వివాహాలు చేయడంతో పాటు గృహా ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేస్తుంటారు. యాదగిరి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్ర వేడుకలు, శ్రీస్వామి జన్మనక్షత్రం స్వాతి, స్వామి వారి పవిత్రోత్సవాలు ఈ మాసంలో రావడం విశేషం.
– మంగళగిరి నర్సింహమూర్తి,
యాదగిరిగుట్ట ఆలయ ముఖ్య అర్చకుడు
ఫ రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం
ఫ యాదగిరిగుట్ట క్షేత్రంలో తిరునక్షత్ర వేడుకలు, పవిత్రోత్సవాలు
ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతం..
మహిళలు నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలగాలని కోరుకుంటూ నూతన వధువులు ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతం నిర్వహిస్తారు. అన్యోన్య దాంపత్యం, మంచి సంతానం కలగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహం జరిగిన మొదటి ఐదేండ్ల పాటు ఈ మాసంలో ప్రతి మంగళవారం వ్రతం చేపడతారు. ఇక సర్పదోషాలు తొలగిపోవడానికి నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు. నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. వెండితో నాగ ప్రతిమలు చేసి పుట్టల్లో వదులుతారు. అష్ట ఐశ్యర్యాలు ప్రసాదించి సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుతూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.

పండుగలు, శుభకార్యాలకు వేళాయే..