
‘నవోదయ’ అథ్లెటిక్ మీట్ ప్రారంభం
పెద్దవూర: పెద్దవూర మండల పరిధిలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో మూడు రోజుల పాటు జరగనున్న తెలంగాణ క్లస్టర్ లెవల్ అథ్లెటిక్ మీట్–2025 బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మండల విద్యాధికారి తరి రాములు ప్రారంభించి మాట్లాడారు. ఓటమి అనేది గెలుపునకు నాంది కావాలని, ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడకుండా గెలుపుకోసం ప్రయత్నం చేయాలని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు నిత్య జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని సూచించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదవడం అంటే విద్యార్థులు అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మత్తు పదార్థాలు తీసుకుకోవడం కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆదర్శవంతమైన సమాజానికి మార్గనిర్ధేశం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 9 జవహర్ నవోదయ విద్యాలయాల నుంచి 57 మంది బాలురు, 39 మంది బాలికలు కలిపి ఈ అథ్లెటిక్ మీట్‌లో పాల్గొననున్నారు. అంతకుముందు వివిధ జేఎన్‌వీల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో చలకుర్తి జేఎన్‌వీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె. శంకర్, నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ చక్రవర్తి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి డి. విమల, క్రీడా ఆర్గనైజర్ పీడీ మంజులారాధ, పీడీలు శోభారాణి, వెంకట్రాంరెడ్డి, కూతాటి మురళి, లెనిన్‌బాబు, శంభులింగం, వెంకట్, అలివేలు, ఎల్లయ్య, అధ్యాపకులు విష్ణువర్థన్‌శర్మ, అమర్‌లింగాచారి తదితరులు పాల్గొన్నారు.

‘నవోదయ’ అథ్లెటిక్ మీట్ ప్రారంభం