విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jul 24 2025 8:53 AM | Updated on Jul 24 2025 8:53 AM

విద్యుదాఘాతంతో  రైతు మృతి

విద్యుదాఘాతంతో రైతు మృతి

నేరేడుచర్ల: విద్యుత్‌ మోటారు ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నెలో జరిగింది. ఎస్‌ఐ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికల్‌దిన్నెకి చెందిన నగిరి శ్రీను(57) నారుమడికి నీరు పెట్టేందుకు బుధవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి విద్యుత్‌ మోటారు ఆన్‌ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అప్పుల బాధతో

కారోబార్‌ ఆత్మహత్య

నార్కట్‌పల్లి: అప్పుల బాధతో ఉరేసుకుని గ్రామ పంచాయతీ కారోబార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మనబోలు గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కారోబార్‌ షేక్‌ షకీల్‌ అహ్మద్‌(29) ఇంటి నిర్మాణం కోసం శ్రీరామ్‌ చిట్‌ఫండ్స్‌లో రూ.12 లక్షల లోన్‌ తీసుకున్నాడు. లోన్‌ కట్టలేక అప్పులు ఎక్కువై మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య షేక్‌ నజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం మృతుడి కుటుంబ సభ్యులకు గ్రామ పంచాయతీ తరఫున రూ.10వేలను పంచాయతీ కార్యదర్శి అలేందర్‌రెడ్డి అందజేశారు.

ఐదేళ్లు జైలు శిక్ష

మోత్కూరు: హత్యాయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ రామన్నపేట కోర్టు జడ్జి బుధవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పొడిచేడు గ్రామానికి చెందిన కాసర్ల జానయ్యకు అదే గ్రామానికి చెందిన కాసర్ల అంజయ్య మధ్య పొలం గెట్టు వివాదం కొనసాగుతుండగా.. 2020లో కాసర్ల జానయ్య కాపుగాసి కాసర్ల అంజయ్యపై గొడ్డలితో దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ హరిప్రసాద్‌ కేసు నమోదు చేసి జానయ్యను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు తుది విచారణలో భాగంగా బుధవారం రామన్నపేట కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి నిందితుడు కాసర్ల జానయ్యకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జానయ్యను నల్లగొండ జిల్లా జైలుకు తరలించినట్లు మోత్కూరు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

అరటికాయల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా

అందినకాడికి లూటీ చేసిన జనం

పెద్దవూర: అరటికాయల లోడుతో వెళ్తున్న డీసీఎం పెద్దవూర మండలం అచ్చన్నబావి సమీపంలో బుధవారం తెల్లవారుజామున బోల్తా పడింది. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు డీసీఎం వద్దకు చేరకుని అందినకాడికి అరటికాయలు లూటీ చేశారు. వివరాలు.. ఆంధ్రపదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా పోరుమామిళ్ల నుంచి అరటికాయల లోడుతో డీసీఎం హైదరాబాద్‌కు వెళ్తోంది. బుధవారం తెల్లవారుజామున 3.00గంటల ప్రాంతంలో నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిపై పెద్దవూర మండలం అచ్చన్నబావి సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కన బండరాయిని ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అరటికాయల డీసీఎం బోల్తా పడిందని తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని ట్రేలతో సహా అరటికాయలను ఎత్తుకెళ్లారు. అరటికాయలు తీసుకెళ్లినా పర్వాలేదని, ట్రేలను మాత్రం తీసుకెళ్లొద్దని డ్రైవర్‌ ఎంత ప్రాధేయపడినా వినిపించుకోకుండా అందినకాడికి దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అక్కడి నుంచి పంపించేశారు. డీసీఎంలో రూ.4లక్షల సరుకు ఉండగా.. సగానికి పైగా తీసుకెళ్లారని, వందకు పైగా ట్రేలను అపహరించుకుపోయినట్లు డ్రైవర్‌ వాపోయాడు. మిగిలిపోయిన అరటికాయలను వేరే డీసీఎంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement