
ప్రతిపక్షం మౌనం వీడడం లేదు
భువనగిరిటౌన్ : రాష్ట్రంలోని పింఛన్ దారులను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. మంగళవారం భువనగిరిలోని ఏఆర్ గార్డెన్‌లో చేయూత పింఛన్‌దారుల మహాగర్జన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు రూ.4వేలు పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి 19 నెలలు దాటినా పింఛన్ల పెంపును అమలు చేయడం లేదన్నారు. అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా జీతం పడుతుటే రాష్ట్రంలోని సామాజిక పింఛన్ డబ్బులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పింఛన్లు పెంచకుంటే ఆగస్టు 13న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పెన్షన్‌దారుల మహాగర్జనను నిర్వహించి తాడోపేడో తేల్చుకుంటామన్నారు. కండరాల క్షీణత కలిగిన వారికి రూ 15వేల పెన్షన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాశీం, జిల్లా అధ్యక్షులు ధరణికొట నర్సింహ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ బిర్రు మహేందర్ మాదిగ, కో ఇన్‌చార్జి పల్లెర్ల సుధాకర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ మాదిగ, దళిత ఐక్య వేదిక చైర్మన్ భట్టు రాంచంద్రయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు గిద్దె రాజేష్, సింగారం రమేష్, మచ్చ ఉపేందర్, లోడి ధనుంజయ్య గౌడ్, సందెల శ్రీనివాస్ మాదిగ, బండారి శివశంకర్, రజిత, పద్మ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 13న పింఛన్‌దారుల
మహాగర్జన నిర్వహిస్తాం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ