
కార్మికులు ఏడాదికి 28 చీరలు నేయాలి
చౌటుప్పల్: నేతన్న భరోసా పథకంలో భాగంగా చేనేత కార్మికులు కనిష్టంగా ఏడాదికి నాలుగు వార్పులు (28 చీరలు) నేయాలని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అమలుచేస్తున్న పథకాలైన నేతన్న భరోసా, నేతన్న భద్రత, నేతన్న పొదుపు, రుణమాఫీ పథకాలపై నేత కార్మికులకు చౌటుప్పల్‌లో మంగళవారం జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. నేతన్నల నుంచి వచ్చిన అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నేతన్నలు నేసిన చీరలకు తెలంగాణ హ్యాండ్లూమ్ లేబుల్‌ను అంటించి సహాయ సంచాలకులు కార్యాలయానికి పంపించాలని సూచించారు. అలా పంపించిన నేతన్నకు వారి బ్యాంకు అకౌంట్‌లో రూ.18వేలు, వారి అనుబంధ కార్మికుడి అకౌంట్‌లో రూ.6వేల చొప్పున నేరుగా జమ అవుతాయని పేర్కొన్నారు. అద్భుతమైన ఈ పథకాలను నేతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వివిధ సమస్యలపై చేనేత సంఘాల నాయకులు, కార్మికులు.. శైలజారామయ్యర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అదనపు సంచాలకులు బి. శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త సంచాలకురాలు ఇందుమతి, రీజినల్ డీడీ బి. పద్మ, యాదాద్రి, నల్లగొండ జిల్లాల సహాయ సంచాలకులు ఎ. శ్రీనివాస్, ఎస్. ద్వారక, డీఓలు, ఏడీఓలు, ఉమ్మడి జిల్లా చేనేత సహకార సంఘాల పర్సన్ ఇన్‌చార్జిలు, చేనేత నాయకులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజా రామయ్యర్