
భువనగిరిలో పర్యటించిన పశ్చిమ బెంగాల్ అధికారులు
సాక్షి,యాదాద్రి: రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థపై అధ్యయనం చేయడానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల బృందం మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చారు. ఈ బృందంలో ప్రత్యేక కార్యదర్శి ప్రణబ్ బిస్వాస్, సీనియర్ టెక్నికల్ డైరెక్టర్ సుప్రతిమ్ లోధ్, సంయుక్త డైరెక్టర్లు సునయ్ కుమార్ గోస్వామి, దేబమాల్య బసు ఉన్నారు. వారు తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ధాన్యం సేకరణలో రాష్ట్రం అమలు చేస్తున్న విధానం, వాహన లొకేషన్ ట్రాకింగ్ అమలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని వినోద్ ట్రేడర్స్ మిల్లును సందర్శించి మిల్లింగ్ జరుగుతున్న తీరును, రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌లో ధాన్యం నమోదు, బియ్యం సేకరణ వంటి అంశాలను పరిశీలించారు. వారి వెంట జిల్లా మేనేజర్ డి. హరిక్రిష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం. రోజారాణి, రైస్ మిల్లు యజమానులు తదితరులు ఉన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థపై
అధ్యయనం