
పోగొట్టుకున్న బంగారం, వెండి బాధితులకు అప్పగింత
పెద్దవూర: ఆటోలో పోగొట్టుకున్న బంగారు, వెండి ఆభరణాలను గంట లోపే పెద్దవూర పోలీసులు గుర్తించి బాధితులకు అప్పగించారు. గురువారం పెద్దవూర ఎస్‌ఐ వై. ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పర్వేదుల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వేముల కనకయ్య, అతడి భార్య సింహాచలం గురువారం మధ్యాహ్నం మిర్యాలగూడలో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లటానికి సిద్ధమయ్యారు. సింహాచలం తన బంగారు, వెండి ఆభరణాలతో పాటు దుస్తులను సంచిలో పెట్టుకుంది. వారు స్వగ్రామంలో ఆటో ఎక్కి పెద్దవూరలో దిగారు. ఆటో దిగే సమయంలో తమ వెంట తెచ్చుకున్న సంచిని అందులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత తమ వెంట తెచ్చుకున్న సంచి లేదని గమనించిన వృద్ధ దంపతులు రోడ్డు పక్కన కూర్చోని విలపిస్తుండగా.. స్థానిక యువకులు గమనించి వారిని పెద్దవూర పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి వృద్ధ దంపతులు పర్వేదుల నుంచి ఎక్కి వచ్చిన ఆటో హైదరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆటో నంబర్‌ను పెద్దఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి, చింతపల్లి పోలీస్ స్టేషన్లకు పంపించగా.. చింతపల్లి మండలం మాల్‌లో అక్కడి పోలీసులు ఆటోను పట్టుకున్నారు. ఆటోను తనిఖీ చేయగా.. సీటు వెనకాల సంచి ఉన్నట్లు గుర్తించారు. వాస్తవంగా ఆటో డ్రైవర్ కూడా ఆ సంచిని గమనించలేదు. పెద్దవూర పోలీసులు చింతపల్లికి వెళ్లి ఆటోను, ఆభరణాలు ఉన్న సంచిని పెద్దవూరకు తీసుకొని వచ్చారు. సంచిలో 15 తులాల వెండి కాళ్ల పట్టీలు, రెండున్నర తులాల బంగారు నాంతాడు, 2 తులాల వెండి మట్టెలు, బంగారు ముక్కుపుడకతో పాటు దుస్తులు ఉండగా.. వాటిని వృద్ధ దంపతులకు అప్పగించారు. గంట వ్యవధిలోనే పోగొట్టుకున్న ఆభరణాలను గుర్తించి బాధితులకు అప్పగించిన హెడ్ కానిస్టేబుల్ ఇద్దయ్య, కానిస్టేబుళ్లు కిషన్‌నాయక్, లోకేష్‌రెడ్డి, రాజు, వెంకన్న, శ్రీకాంత్, సైదిరెడ్డి, హుషానాయక్‌ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.