
వెదిరె రాంచంద్రారెడ్డికి భారతరత్న ఇవ్వాలి
భూదాన్‌పోచంపల్లి: వెయ్యి ఎకరాల భూమిని దానం చేసి భూదానోద్యమానికి శ్రీకారం చుట్టిన ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డికి భారతరత్న ఇవ్వాలని అఖిలభారత సర్వోదయ మండలి అధ్యక్షుడు, రాంచంద్రారెడ్డి మనవడు వెదిరె అరవిందారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పోచంపల్లి పట్టణ కేంద్రంలో వెదిరె రాంచంద్రారెడ్డి 128వ జయంత్యోత్సవాలను పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహానికి అరవిందారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినోబాభావే మందిరంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1951లో భూమికోసం సాయుధ పోరాటాలు జరుగుతున్న తరుణంలో ఆచార్య వినోబాభావే కోరిక మేరకు వెయ్యి ఎకరాలు భూమి దానం చేసి వెదిరె రాంచంద్రారెడ్డి ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. కానీ నేడు కొందరు అక్రమార్కులు భూదాన్ భూములను అన్యాక్రాంతం చేస్తూ భూదాన స్పూర్తికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే భూదాన బోర్డులో పోచంపల్లి స్థానికులకు డైరెక్టర్‌గా అవకాశం కల్పించుటకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో అఖిలపక్ష పార్టీలతో పాటు పార్టీయేతర ముఖ్యనాయకులతో పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్ చౌరస్తాలో భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వెదిరె రాంచంద్రారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షుడు తూపునూరి కృష్ణగౌడ్, వెదిరె రాంచంద్రారెడ్డి కుమారుడు వెదిరె సాగర్‌రెడ్డి, వెదిరె రాంచంద్రారెడ్డి సేవాసమితి నాయకులు కొమ్ము లక్ష్మణ్, కరగల్ల కుమార్, మాజీ కౌన్సిలర్ పెద్దల చక్రపాణి, గునిగంటి మల్లేశ్, చేరాల చిన్న నర్సింహ, ఇబ్రహీంపట్నం అంజయ్య, వంగూరి రాజు, ఎర్ర భిక్షపతి, పెద్దల సన్నీ, బాల్‌నర్సింహ, మల్లేశ్, చేరాల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.