
భూ వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
మోతె: అన్నదమ్ముల మధ్య నెలకొన్ని భూమి తగాదాలో భాగంగా తమ్ముడు అన్నను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరచిన ఘటన మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావిపహాడ్ గ్రామానికి చెందిన గునగంటి వెంకన్న, అనసూర్య దంపతులకు ముగ్గురు కుమారులు రమేష్, ఉపేందర్, చంద్రశేఖర్, ఒక కుమార్తె సంతానం. వెంకన్న, అనసూర్య దంపతులకు 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని వెంకన్న తన ముగ్గురు కొడుకులు 5 ఎకరాల చొప్పున పంచి ఇచ్చాడు. మిగిలిన 6 ఎకరాల భూమిని వెంకన్న తన పేరిటే ఉంచుకున్నాడు. కొంతకాలం నుంచి అన్నదమ్ములు రమేష్, ఉపేందర్ మధ్య గెట్లు పంచాయితీ నడుస్తోంది. ఇదే విషయమై గతంలో వీరు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం గునంటి ఉపేందర్, అతడి భార్య జ్యోతి కలిసి వ్యవసాయ పొలం వద్ద రమేష్‌తో గొడవపడ్డారు. ఈ క్రమంలో రమేష్ ముఖంపై రాళ్లతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాకుండా ఉపేందర్ భార్య జ్యోతి.. రమేష్ భార్య సరితపై దాడి చేయడంతో సరితకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి చిన్న తమ్ముడు గునగంటి చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపేందర్, అతడి భార్య జ్యోతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపారు. గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పెద్దమనుషులు ఉన్నప్పటికీ నోరు మెదపలేదని ఫిర్యాదుదారుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఫ అన్న, అతడి భార్యపై దాడి చేసిన తమ్ముడు, అతడి భార్య