
సరఫరా సాఫీగా..
భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా డిస్కం దృష్టి
ఫ పీటీఆర్‌ల సామర్థ్యం పెంపు, అదనపు డీటీఆర్‌లు ఏర్పాటు
ఫ లోడ్‌ను తట్టుకునేందుకు ఇంటర్ లింకింగ్ లైన్లు
ఫ రూ.47.78 కోట్లు కేటాయింపు
ఫ తుది దశకు చేరిన పనులు
ఆలేరు: విద్యుత్ డిమాండ్ ఊహించని రీతిలో పెరిగిపోతోంది. ఏటా 5 శాతం వినిమయం అధికంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఓవర్ లోడ్‌ను తట్టుకునేందుకు, భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల (పీటీఆర్) సామర్థ్యం పెంచడంతో పాటు అదనంగా డిస్ట్రిబ్యూషన్ (డీటీఆర్) ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు పాత లైన్లపై భారం పడకుండా కొత్తగా ఇంటర్ లింకింగ్ లైన్లు వేస్తోంది.
కేటగిరీల వారీగా కనెక్షన్లు
జిల్లాలో వివిధ కేటగిరీలకు సంబంధించి 3,97,287 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ 2,78,420, వ్యవసాయ 1,18,805, ఇండస్ట్రియల్ కనెక్షన్లు 620 ఉన్నాయి. ఇందులో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. గత నెల అన్ని కనెక్షన్లకు సగటున రోజుకు 6,866 మిలియన్ యూనిట్‌ల విద్యుత్ వినియోగం జరిగింది. వర్షాలు కురువకపోతే ఈనెలలో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రధాన సమస్యలు
మానవాళి ప్రాథమిక అవసరాల్లో విద్యుత్ కీలకం. జనాభా పెరగడం, కొనుగోలు శక్తి అధికమవడం, విద్యుత్ లైన్లు విస్తరించడంతో కరెంట్ వినియోగం పెరుగుతోంది. తద్వారా ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ పడి బ్రేక్‌డౌన్లు, విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, కోతలు, లో ఓల్టేజీకి కారణమవుతోంది. సమస్యలను అధిగమించేందుకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవసరం మేరకు 25, 63,100,160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు.
పాతవాటి సామర్థ్యం పెంపు, కొత్తవి ఏర్పాటు
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 33/11 కె.వీ విద్యుత్ కేంద్రాల్లోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల (పీటీఆర్) సామర్థ్యాలను పెంచుతున్నారు. జిల్లాలో భువనగిరి, రామన్నపేట విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. వీటి సబ్ డివిజన్ల పరిధిలో చామపూర్, అనాజిపూర్, మో త్కూరు, వేములకొండ, సోలిపేట్, బొమ్మలరామా రం, కోయలగూడెం సబ్‌స్టేషన్లలో 5 ఎంవీఏ పీటీఆర్‌ల స్థానాల్లో రూ.7 కోట్లతో కొత్తగా ఏడు 8 ఎంవీఏ పీటీఆర్‌లు, రూ.40కోట్లతో 768 డీటీఆర్ (డిస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల)లను ఏర్పాటు చేశారు.
లోడ్ విభజనకు ఇంటర్ లింకింగ్ లైన్లు
ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్య పెంచడం వల్ల విద్యుత్ లైన్లపై లోడ్ భారం పడి, అవి తెగిపోయే ప్రమాదం ఉంది. అలాకాకుండా 11కేవీ, 33కేవీ ఎల్‌టీ లైన్ల సామర్థ్యాన్ని పెంచారు. పాత విద్యుత్ లైన్లపై లోడ్‌ను విభజించేందుకు ఆలేరు సబ్ డివిజన్‌లోని ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల పరిధిలోని శారాజీపేట, సోమారం, రాఘవాపూర్, శ్రీనివాస్‌పూర్, చొల్లేరు, రఘనాథ్‌పురం,సైదాపురం,మల్లాపురం, యాదగిరిగుట్ట పట్టణం, రేణిగుంట, పారుపల్లి, వర్టూరు తదితర గ్రామాల్లో, ఇదే మాదిరిగా మిగితా ఐదు సబ్ డివిజన్లలోనూ సుమారు రూ.78 లక్షలతో 26 కి.మీ వరకు ఇంటర్‌లింకింగ్ లైన్లు వేశారు.
ప్రయోజనాలు ఇవీ..
ఉదాహరణకు ఆలేరులోని ప్రభుత్వ ఆస్పత్రికి స్థానిక 11 కేవీ ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఎప్పుడైనా పట్టణ ఫీడర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినా, మరేదైనా కారణంతో ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చు. అత్యవసర సేవలు అందిస్తున్న సమయంలో కరెంట్ నిలిచిపోవడం వల్ల రోగులకు ఇబ్బంది కలిగే ఆస్కారం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలని ఆలేరు పరిధిలోని శారాజీపేట నుంచి మందనపల్లి శివారు రోడ్డు మలుపు వరకు సుమారు 1.5 కి.మీ మేర ఇంటర్‌లింకింగ్ లైన్ వేసి ఆస్పత్రికి అనుసంధానం చేశారు. పట్టణ ఫీడర్‌లో సమస్య వచ్చినా ఆస్పత్రికి కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండదు. ఇదే తరహాలో జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఇంటర్‌లింకింగ్ లైన్ల ద్వారా ప్రయోజనం ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ కనెక్షన్లు
గృహ 2,78,420
మొత్తం 3,97,845
పరిశ్రమలు 620
వ్యవసాయం 1,18,805
సామర్థ్యం పెంచిన పీటీఆర్‌లు 07
కొత్త డీటీఆర్‌లు 768
2023–2025 వరకు రోజుకు సగటున
విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో)
నెల 2023 2024 2025
జనవరి 6,659 7,566 7,694
ఫిబ్రవరి 8,330 9,446 9,203
మార్చి 8,705 9,406 9,697
ఏప్రిల్ 5,955 5,818 5,886
మే 4,039 4,799 4,670
జూన్ 5,996 6,928 6,866
డిమాండ్ పెరిగినా సమస్య ఉండదు
ఏటేటా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ కేటగిరీలకు సంబంధించి 79,569 కనెక్షన్లు పెరిగాయి. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉలేకపోలేదు. లోడ్ అధికమైనా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పీటీఆర్‌ల సామర్థ్యం పెంచడంతో పాటు, కొత్త డీటీఆర్‌లు ఏర్పాటు చేశాం. పనులు పూర్తి కావొచ్చాయి.
–ఆర్.సుధీర్‌కుమార్, ఎస్‌ఈ

సరఫరా సాఫీగా..

సరఫరా సాఫీగా..

సరఫరా సాఫీగా..

సరఫరా సాఫీగా..