
ఎంఎంటీఎస్ పనులకు మోక్షం
సాక్షి, యాదాద్రి : జిల్లావాసుల ఎంఎంటీఎస్ కల సాకారం కాబోతోంది. ఘట్కేసర్ నుంచి రాయగిరి స్టేషన్ వరకు పొడిగించిన ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ఇప్పటికే రూ. 412 కోట్లు మంజూరు చేసింది. తొలి విడతలో రూ.100 కోట్లు విడుదల చేసింది.
తొమ్మిదేళ్లకు కదలిక
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 2016లో కేంద్రం ఎంఎంటీఎస్ రైలును మంజూరు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌నుంచి యాదాద్రి జిల్లా రాయగిరివరకు 33 కిలో మీటర్లు పొడిగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.330 కోట్లు కాగా.. కేంద్రం తన వాటాగా రూ.220 కోట్లు, రాష్ట్రం రూ.110 కోట్లు భరించాల్సి ఉంది. అయితే రాష్ట్రా వాటా విడుదలలో జాప్యం వల్ల పనులు ముందుకు సాగలేదు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులతో ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గత అక్టోబర్‌లో ప్రకటించగా.. తాజాగా కేంద్రం నిధులు కేటాయించింది.
ప్రత్యేకంగా ట్రాక్ నిర్మాణం
ఎంఎంటీఎస్‌కోసం ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఘట్కేసర్ నుంచిరాయగిరి వరకు ప్రస్తుత ట్రాక్‌వెంట భూములు సేకరించనున్నారు. భవిష్యత్‌లో వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ పొడిగించే అవకాశం ఉంది.
కొనసాగుతున్న భూసేకరణ సర్వే : గత ఏడాది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటనతో ఇప్పటికే భూ సేకరణ పనులు మొదలయ్యాయి. సుమారు 50 ఎకరాల సేకరణ పూర్తయ్యింది. గుట్ట మండలం వంగపల్లి శివా రు వరకు సర్వే చేయాల్సి ఉంది. గూడూరులో జంక్షన్ ఉన్నందున అక్కడ భూసేకరణ ఎక్కువగా చేయాల్సి ఉంది.
ఫ రూ.100 కోట్లు విడుదల చేసిన కేంద్రం
ఫ బీబీనగర్ నుంచి రాయగిరి
రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక ట్రాక్
రైల్వే శాఖకు ధన్యవాదాలు
ఎంఎంటీఎస్ విస్తరణకు కేంద్రం రూ.421 కోట్లు కేటాయించడం హర్షణీయం. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపాం. భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది. ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జనగామ వరకు పొడిగించాలని ప్రతిపాదన చేశాం.
–ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

ఎంఎంటీఎస్ పనులకు మోక్షం