
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
రామగిరి(నల్లగొండ) : ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ శివకృష్ణ అన్నారు. బుధవారం నల్లగొండలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడులపై సలహాలు ఇస్తామని మోసగాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. సులభంగా డబ్బులు రావనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కోరారు. ఎస్‌బీఐ బీఓడీ ఏజీఎం ప్రశాంత్ మాట్లాడుతూ.. కస్టమర్లకు ఏమైనా సందేహాలు వస్తే ఎస్‌బీఐ బ్రాంచ్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జి. వెంకటేశ్వరరావు, బ్యాంకుల మేనేజర్లు, ఖాతాదారులు పాల్గొన్నారు.