
గానుగ నూనెతో ఆరోగ్యం
రెండు నెలల నుంచి వాడుతున్నా
పల్లీ గానుగ నూనెను గత రెండు నెలల నుంచి వాడుతున్నాను. చాలా మంచిగా ఉంది. గతంలో వాడిన నూనె కన్నా ఈ నూనె చాలా తక్కువగా వాడుతున్నాం. ధర ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిగా ఉంది. గానుగ నూనె వాడటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావడం లేదు.
– మేకల రాజిరెడ్డి నార్కట్‌పల్లి
కల్తీ నూనె నివారించేందుకే..
కల్తీ వంట నూనె వాడటం వల్ల రోగాల బారిన పడుతున్న ప్రజలకు ఎద్దుతో తయారు చేసే గానుగ నూనెను అందించాలనే ఉద్దేశంతో ఈ గానుగ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. పల్లీలు తీసుకొస్తే ఉచితంగా గానుగ పట్టి నూనె తీసి ఇస్తాం. ఎక్కువగా వ్యాపారం చేయడానికి కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేందుకు దీనిని ఏర్పాటు చేశాం. త్వరలో కల్తీ లేకుండా పసుపు, కారం కూడా తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నాం.
– రేగట్టే భూపాల్‌రెడ్డి, ఎద్దు గానుగ నూనె కేంద్రం నిర్వాహకుడు
రోజూ 10 లీటర్లు విక్రయిస్తున్నా
రోజుకు రెండు సార్లు పల్లీలు రోలులో పోసి ఎద్దుతో గానుగ తిప్పుతున్నాను. పల్లీలు 10 కిలోల చొప్పున రెండు సార్లు పోయడం వలన 7లీటర్ల పల్లీ నూనె వస్తుంది. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై వెళ్లే వారు ఎక్కువగా కొంటున్నారు. దాదాపు రోజు 10 లీటర్ల పల్లీ నూనె విక్రయిస్తున్నాం. ఎప్పటికప్పుడు నూనె అమ్ముడవుతూనే ఉంది. నిల్వ ఉండడం లేదు.
– గండికోట ఎల్లయ్య, గుమాస్తా
నార్కట్‌పల్లి: ఇంట్లో ప్రతి వంటలో నూనె ఉపయోగిస్తుంటాం. ఈ నూనె కల్తీగా మారితే అనారోగ్యం బారిన పడక తప్పదు. పాత కాలంలో మాదిరిగా ప్రజలకు స్వచ్ఛమైన నూనె అందించాలని సంకల్పించారు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన సీనియర్ అడ్వకేట్ రేగట్టే భూపాల్‌రెడ్డి. గత మూడు నెలల నుంచి నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిలో నార్కట్‌పల్లి సమీపంలో తన వ్యవసాయ భూమిలో ఎద్దులతో గానుగ తిప్పి నూనె తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రసుత్తం వర్కర్లు చూసుకుంటున్నారని, ఎద్దు గానుగతో పల్లీ, కొబ్బరి, ఆవాల నూనె తీస్తున్నట్లు పేర్కొన్నారు. 10 కిలోల పల్లీలు గానుగలో పోసి 4గంటల పాటు ఎద్దుతో తిప్పితే మూడున్నర లీటర్ల పల్లీ నూనె వస్తుందని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా 12 కిలోల ఎండు కొబ్బరి గానుగలో పోసి 8గంటల పాటు ఎద్దుతో తిప్పితే 4కిలోల కొబ్బరి నూనె వస్తుందని, 10 కిలోల అవాలు 8గంటల పాటు తిప్పితే 4కిలోల ఆవాల నూనె వస్తుందని చెబుతున్నారు. గానుగ రోలు నుంచి తిసిన నూనెను దాదాపు 5గంటల పాటు ఎండలో పెట్టడం వల్ల మడ్డి అడుగు భాగానికి పోయి తేలిక పాటి నూనె పైకి తేలుతుందని, ఆ నూనెను బాటిళ్లలో పోసి విక్రయిస్తుంటామని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని పేర్కొన్నారు. రోజుకు 10 లీటర్ల పల్లీ నూనె విక్రయిస్తున్నామని, ఎక్కువగా నార్కట్‌పల్లి, నల్లగొండ, హైదరాబాద్, గుంటూరు వెళ్లే వారు కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఫ నార్కట్‌పల్లి సమీపంలో వెలిసిన
ఎద్దు గానుగ నూనె తయారీ కేంద్రం
ఫ మంచి స్పందన
ఉందంటున్న నిర్వాహకుడు
నూనె ధర (లీటరుకు)
పల్లీ నూనె రూ.350
కొబ్బరి నూనె రూ.600
ఆవాల నూనె రూ.600

గానుగ నూనెతో ఆరోగ్యం

గానుగ నూనెతో ఆరోగ్యం