
ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు టోకరా
మిర్యాలగూడ: దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులో గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, తాను కూడా అందులోనే ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నానని ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తి అధికార పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిరుద్యోగులకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అతడిని నమ్మి ఏపీలోని విజయవాడకు చెందిన ఐదుగురు, నకిరేకల్, మిర్యాలగూడకు చెందిన మరికొందరు ఫోన్ పే ద్వారా, నగదు రూపంలో సుమారు రూ.20లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం. తీరా ఉద్యోగాలేవి అని నిరుద్యోగులు నిలదీయగా డూప్లికేట్ ఐడీ కార్డులు, అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులకు అంటగట్టాడు. వారు వాకబు చేయగా అవి నకిలీవని తేలడంతో మోసపోయామని గ్రహించారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని నిరుద్యోగులు అతడిని ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు వాపోయారు. వైటీపీఎస్ అధికారులను సంప్రదించగా.. సదరు వ్యక్తి వైటీపీఎస్‌లో ఉద్యోగం చేయడం లేదని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై డీఎస్పీ రాజశేఖర్‌రాజును వివరణ కోరగా.. ఇప్పటివరకు ఎవరూ దీనిపై ఫిర్యాదు చేయలేదని, బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫ రూ.20లక్షల వరకు వసూలు చేసిన నిందితుడు
ఫ బాధితులు డబ్బులు అడిగితే బెదిరింపులకు
పాల్పడుతున్న వైనం

ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు టోకరా