
చివరి దశకు ‘గంధమల్ల’ భూసేకరణ
తుర్కపల్లి: ఆలేరు నియోజకవర్గంలో 65వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. రిజర్వాయర్ నిర్మాణానికి 1,028.83 ఎకరాల భూమి అవసరముండగా తుర్కపల్లి మండల పరిధిలోని గంధమల్ల, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో అధికారులు సేకరిస్తున్నారు. అయితే పరిహారం విషయంలో ఆయా గ్రామాల రైతులు ఎకరాకు రూ.40 లక్షలు డిమాండ్ చేయగా ప్రభుత్వం ప్రారంభంలో రూ.16 లక్షల నుంచి రూ.18లక్షల వరకు పరిహారం ప్రతిపాదించింది. చివరకు రైతుల ఆందోళనల నేపథ్యంలో మంత్రులతో చర్చించి ఎకరాకు రూ.24.50 లక్షల పరిహారం చెల్లిస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
వేగవంతంగా పనులు
పరిహారం ఖరారైన వెంటనే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ముంపునకు గురయ్యే భూముల వారీగా వివరాలు సేకరించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. రెండు రోజుల్లోగా నష్టపరిహారం విడుదల చేయాలని లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. పూడికతీత, భూముల స్థితిగతులు, నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలపై ప్రాథమిక స్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం రూ.575.75 కోట్లు కేటాయించి, బీకేఎం–నవయుగ–ప్రసాద్ కన్సార్టియం సంస్థతో నిర్మాణ కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గంధమల్ల, వీరారెడ్డిపల్లి రెవన్యూ గ్రామాల్లో దాదాపు 1,028.83 ఎకరాల భూములు ముంపునకు గురవుతుండగా ఇందులో కట్ట నిర్మాణానికి 112 ఎకరాలు, మిగిలినవి పూర్తిగా నీటి మునిగే ప్రాంతాలుగా గుర్తించారు..
ప్రయోజనం పొందే మండలాలు
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలోని 65 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో తుర్కపల్లి మండలంలో 945 ఎకరాలు, ఆలేరు మండలంలో 10,506 ఎకరాలు, రాజాపేటలో 33,014 ఎకరాలు, యాదగిరిగుట్టలో 14,522 ఎకరాలకు సాగునీరందనుంది. ప్రణాళిక ప్రకారం మల్లన్న సాగర్ నుంచి వచ్చే 2,450 క్యూసెక్కుల నీటిని గంధమల్ల జలాశయానికి తీసుకొస్తారు. ఈ నీటిని కుడి, ఎడమ కాలువలు ద్వారా పంపిణీ చేస్తారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ తొలుత ప్రతిపాదించిన 9.8 టీఎంసీల సామర్థ్యాన్ని ముంపు గ్రామాల ప్రజల నిరసనలతో 4.28 టీఎంసీలకు అనంతరం 1.41 టీఎంసీలకు పరిమితం చేసింది.
ఫ ఎకరాకు రూ.24.50 లక్షల పరిహారానికి అంగీకారం
ఫ 1,028.83 ఎకరాల సేకరణ
దిశగా అడుగులు
ఫ పనులు వేగవంతం చేసిన
యంత్రాంగం
న్యాయమైన పరిహారం ఇవ్వాలి
రైతులు భూములతోపాటు బోర్లు, బావులు పశువుల షెడ్లు కోల్పోతున్నారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే కాదు, వ్యవసాయ మౌలిక సదుపాయాలపై కూడా న్యాయమైన పరిహారం అందజేయాలి.
– వినోద, భూ నిర్వాసితురాలు, గంధమల్ల

చివరి దశకు ‘గంధమల్ల’ భూసేకరణ