
మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం భువనగిరి పట్టణంలోని ఏఆర్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఏ పథకం మొదలుపెట్టినా ముందు మహిళలకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500లకే వంట గ్యాస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నామన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న లోన్లను నూటికి నూరు శాతం చెల్లించినందున మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలను ఆర్థిక బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టించందన్నారు. కరెంటు ఉత్పత్తి చేసేందుకు కూడా సోలార్ పవర్ ప్లాంట్లు ఇచ్చిందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేదే సీఎం ఆలోచన అని పేర్కొన్నారు.
మహిళలకు పెద్దపీట : కలెక్టర్
కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి సంబరాలు పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలోనే ఆర్టీసీ బస్సులకు కూడా మహిళలే యజమానులు కాబోతున్నారని కలెక్టర్ తెలిపారు. ఇళ్లు నిర్మించుకునే స్తోమత లేని ఇందిరమ్మ లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ వివిధ బ్యాంకుల లింకేజీ ద్వారా రూ.39.97 కోట్లు, వడ్డీలేని రుణాల ద్వారా రూ.6.87 కోట్లు అందించామన్నారు. అనంతరం వివిధ రుణాలకు సంబంధించిన చెక్కులను మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి, స్టేట్ డీజీఓ ట్రెజరర్ మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, మహిళా సమైక్య అధ్యక్షురాళ్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
ఫ కలెక్టర్‌తో కలిసి మహిళా శక్తి సంబరాలకు హాజరు