
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఫ ఎల్‌సీ తీసుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్‌కు
మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం
చిలుకూరు: ఎల్‌సీ తీసుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన దాసి గోవర్ధన్(28) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అదే గ్రామానికి చెందిన గండు వెంకన్న పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయడానికి గోవర్ధన్ వెళ్లాడు. ఎల్‌సీ తీసుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉన్న ఫ్యూజులు తీసివేసి మరమ్మతులు చేస్తుండగా పక్కనే ఉన్న 11కెవీ విద్యుత్ లైన్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై గోవర్ధన్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. విద్యుత్ సిబ్బంది కూడా ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. మృతుడి బావ శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురభి రాంబాబుగౌడ్ తెలిపారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.