
రైళ్లలో గంజాయి రవాణాపై నిఘా
ఆలేరు: రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు మంగళవారం ఆలేరు రైల్వేస్టేషన్‌లో సివిల్, ఆబ్కారీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, మెమూ ఫ్యాంజిర్ బోగిల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనంతరం ప్లాట్‌ఫారంపై పలువురి ప్రయాణికుల బ్యాగ్‌లు, సంచులను పరిశీలించారు. రైళ్లలో గంజాయి రవాణాను అరికట్టేందుకే తనిఖీలు చేపట్టామని సీఐ కొండల్‌రావు చెప్పారు. రైళ్లలో గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందన్నారు. రైళ్లలో అనుమానంగా ఉండే వ్యక్తులు, సీట్ల కింద వస్తువులు, ప్యాకెట్‌లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆలేరు, యాదగిరిగుట్ట, గుండాల ఎస్‌ఐలు వినయ్, కృష్ణప్రసాద్, శ్రీరాములు, సైదులు, ఆబ్కారీ సీఐ దీపిక పాల్గొన్నారు.