
జాతీయ రహదారిపై లారీ బీభత్సం
చౌటుప్పల్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాల పైకి దూసుకెళ్లింది. దీంతో భయాందోళనకు గురైన లారీ డ్రైవర్ కదులుతున్న లారీలో నుంచి బయటకు దూకి పారిపోయాడు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ పలు కార్లు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ రిజిస్ట్రేషన్ నంబర్ గల లారీ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం చౌటుప్పల్‌లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోకి రాగానే అతివేగంగా ఉన్న లారీ అదుపుతప్పడంతో డ్రైవర్ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అదే వేగంతో మరో కారును సైతం ఢీకొట్టాడు. ముందున్న రద్దీని చూసిన లారీ డ్రైవర్ భయాందోళనకు గురై వేగంగా కదులుతున్న లారీలో నుంచి కిందకు దూకేశాడు. దీంతో లారీ అదే వేగంతో ముందు వరుసగా వెళ్తున్న కార్లను, ద్విచక్ర వాహనాలను ఢీకొట్టుకుంటూ విజయవాడ–హైదరాబాద్ హైవే సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లింది. లారీ బీభత్సాన్ని గమనించిన ఇతర వాహనదారులు, హైవే వెంట నిల్చున్న జనం బిగ్గరగా కేకలు వేశారు. కేకలు విన్న ప్రజానీకం అప్రమత్తమై లారీకి దూరంగా వెళ్లారు. అలా సర్వీస్ రోడ్డులో ఉన్న పూలు, అరటిపండ్ల బండ్లను ఢీకొట్టి లారీ ఆగిపోయింది. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదానికి లారీ అతివేగం కారణమా లేదా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా అనేది తెలియరాలేదు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మొత్తం ఆరు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, పలు పూలు, అరటిపండ్ల బండ్లు ధ్వంసమయ్యాయి. ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదుపుతప్పి ముందు వెళ్తున్న
వాహనాల పైకి దూసుకెళ్లిన లారీ
భయంతో రన్నింగ్‌లోనే లారీ దిగి పారిపోయిన డ్రైవర్
పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం
చౌటుప్పల్ పట్టణం కేంద్రంలో ఘటన

జాతీయ రహదారిపై లారీ బీభత్సం

జాతీయ రహదారిపై లారీ బీభత్సం