షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తువులు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తువులు దగ్ధం

Jul 15 2025 12:09 PM | Updated on Jul 15 2025 12:09 PM

షార్ట్‌ సర్క్యూట్‌తో  ఇంట్లోని వస్తువులు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తువులు దగ్ధం

నకిరేకల్‌: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన నకిరేకల్‌ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. నకిరేకల్‌ పట్టణంలోని 2వ వార్డు పద్మశాలీ కాలనీ సమీపంలో సంద సుధీర్‌ నివాసముంటున్నాడు. సుధీర్‌ ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి సోఫా పక్కన తన సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి బాత్‌రూంకు వెళ్లాడు. 10 నిమిషాల తర్వాత సుధీర్‌ బాత్‌రూంలో నుంచి బయటకు వచ్చేసరికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఇళ్లంతా పొగతో నిండిపోయింది. సుధీర్‌ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి బోరు మోటారు నీటితో మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఏసీ, వాషింగ్‌ మిషన్‌, ఫ్రిజ్‌, సోఫాతో ఇతర వస్తువులు కాలిపోయాయి. సుమారు రూ.4లక్షల నుంచి రూ.5లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నాడు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్‌, 2వ వార్డు కౌన్సిలర్‌ రాచకొండ సునీల్‌ బాధితుడిని పరామర్శించారు. ప్రభుత్వం పరంగా నష్టపరిహారం అందజేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.

చెరువులో పడి

బాలుడు మృతి

సూర్యాపేటటౌన్‌ : ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలుడు చెరువులో పడి మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన గొబ్బి కనకలక్ష్మి చిన్న కుమారుడు జీవన్‌కుమార్‌(15) ఈ నెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి తాళం వేసి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంత వెతికినా జీవన్‌కుమార్‌ ఆచూకీ లభించకపోవడంతో అతడి తల్లి సూర్యాపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అయితే సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువులో జీవన్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సద్దుల చెరువు వద్దకు చేరుకుని చనిపోయింది జీవన్‌కుమారే అని నిర్ధారించారు. మృతుడి తల్లి కనకలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సూర్యాపేట పట్టణ పోలీసులు తెలిపారు. మృతుడు ప్రస్తుతం పదో తరగతి చదువుతుండగా.. అతడి తండ్రి గతంలోనే మృతిచెందాడు.

రైస్‌మిల్లులో కింద పడి

ఆపరేటర్‌ మృతి

పెన్‌పహాడ్‌: రైస్‌మిల్లులో పనిచేసే ఆపరేటర్‌ ప్రమాదవశాత్తు మిషన్‌ పైనుంచి కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్‌ మండలం న్యూబంజారాహిల్స్‌ తండాలో జరిగింది. హెడ్‌కానిస్టేబుల్‌ ఆంగోతు యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. న్యూబంజారాహిల్స్‌ తండాలోని శ్రీమహాలక్ష్మి మోడ్రన్‌ రైస్‌మిల్లులో గరిడేపల్లి మండలం కుత్బుషాపురం గ్రామానికి చెందిన సలిగంటి సోమయ్య(48) మిల్లు ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్ర సోమయ్య మిల్లులో మిషన్‌పై పనిచేస్తుండగా ప్రమాదశాత్తు పైనుంచి కిందపడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. రైస్‌మిల్లు యాజమాని ఇస్లావత్‌ వెంకన్నపై మృతుడి కుమారుడు వినిత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement