
ఆలేరులో ఒకే రోజు మూడు చోరీలు
ఆలేరు: ఆలేరు పట్టణంలో దొంగలు ఒకే రోజు మూడు చోరీలకు పాల్పడ్డారు. సీఐ కొండల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన పరత్వం చిన్నా, వస్పరి వెంకటేష్ చిక్కు వెంట్రుకల వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం నిమిత్తం చిన్నా నెల రోజుల క్రితం, వెంకటేష్ వారం రోజుల కిత్రం వారి ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు చిన్నా, వెంకటేష్ ఇళ్ల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. చిన్నా ఇంట్లో 15తులాల వెండి, పావు తులం బంగారు పుస్తెలతాడు, వెంకటేష్ ఇంట్లో 3గ్రాముల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
బైక్ చోరీ..
అదేవిధంగా ఆలేరు పట్టణంలోని నూనె మిల్లు రోడ్డులో నివాసముంటూ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే మరుపల్లి ప్రవీణ్ ఆదివారం రాత్రి తన పల్సర్ బైక్‌ను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. సోమవారం ఉదయం చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆదివారం రాత్రి ఇద్దరు దుండగులు బైక్‌ను అపహరించినట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించామని సీఐ కొండల్‌రావు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
చిట్యాలలో..
చిట్యాల: చిట్యాల పట్టణంలోని విద్యానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్‌లో నివాసముంటున్న బత్తిని మహేష్ ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం తన ఇంటికి తాళం వేసి ఆయన ఉద్యోగానికి వెళ్లగా.. ఆయన భార్య స్థానికంగా కుట్టు మిషన్ నేర్చుకునేందుకు వెళ్లింది. వారు సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని బీరువాలో దాచిన రెండు బంగారు లాకెట్‌లు, మాటీలు, వెండి ప్లేట్‌తో పాటు కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడు మహేష్ చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.