
పోరుగడ్డకు అండగా ఉంటాం..
ఫ తుంగతుర్తి నియోజకవర్గానికిపూర్తిస్థాయిలో గోదావరి జలాలు తీసుకొస్తాం
ఫ రైతును రాజుగా చేస్తేనే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది
ఫ కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే ఈ స్థాయిలో ఉన్నాం..
ఫ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
ఫ తిరుమలగిరి సభలో లబ్ధిదారులకుకొత్త రేషన్‌కార్డుల పంపిణీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, తిరుమలగిరి (తుంగతుర్తి) : ‘భూమి.. భుక్తి.. విముక్తి కోసం పోరాడిన గడ్డ తుంగతుర్తి.. ఈ గడ్డకు గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, దొడ్డి కొమురయ్య, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచి నల్లగొండ జిల్లాను ఎర్రగొండగా మార్చారు. నల్లగొండ జిల్లా చరిత్రనే తెలంగాణ చరిత్ర. అలాంటి గడ్డ నుంచే ఈరోజు పేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి ముందుగా రూ.34 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేదలకు రేషన్‌కార్డులు అందజేసి మాట్లాడారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో రావి నారాయణరెడ్డికి దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇక్కడి ప్రజలు తెలంగాణ పౌరుషాన్ని చూపించారని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. రైతు రాజుగా మారినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుందని తెలిపారు. రేషన్‌కార్డుల పంపిణీ చేయడం అంటే తెలంగాణలోని నాలుగు కోట్ల మంది పేదలకు సన్న బియ్యం వడ్డించడమేనని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహిరంగ సభకు 6 గంటలు ఆలస్యంగా వచ్చినా పెద్ద ఎత్తున జనం తరలివచ్చి కరెంటు లేకున్నా సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో ఎదురు చూసి మందుల సామేల్‌కు 60 వేల మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యకర్తల కష్టం వల్లే ఈ రోజు మనం అందరం గెలిచి, ఈ స్థానంలో ఉన్నామని, మనకు పదవులు రావడానికి కార్యకర్తలే కారణమని వారిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అందర్నీ సమన్వయం చేసుకొని కలుపుకు పోవాలన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని గొప్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, రామచందర్‌నాయక్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు రమేష్‌రెడ్డి, సంకెపల్లి సుధీర్‌రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తేజస్‌నందలాల్ పవార్, ఇలా త్రిపాఠి, హన్మంతరావు, సివిల్ సప్లయీస్ కమిషనర్ బిఎస్.చౌహాన్ పాల్గొన్నారు.
పదేళ్లు రాచరిక పాలన సాగింది
– అడ్లూరు లక్ష్మణ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి
2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో రాచరిక పాలన సాగిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ విమర్శించారు. పది సంవత్సరాల్లో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీలకు ఏ, బీ, సీ, డీ వర్గీకరణ, కులగణన, సన్న బియ్యం పంపిణీ, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, 59 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని తెలిపారు.
కాంగ్రెస్‌కు కంచుకోట
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తుంగతుర్తి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాపాడారని, గతంలో మా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి, నేను పార్లమెంటు సభ్యులుగా గెలిచామన్నారు. బిక్కేరు వాగుపై బ్రిడ్జి, నాగారం, అడ్డగూడూరు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
ఆ ఆలోచన బీఆర్‌ఎస్‌కు రాలే..
– ఎంపీ చామలకిరణ్‌కుమార్‌రెడ్డి
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామేల్‌కు 50 వేలకు పైగా మెజార్టీ వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు 70 వేలకు పైగా మెజార్టీ వచ్చిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పది సంవత్సరాల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్న బియ్యాన్ని అత్తగారింట్లో (హుజూర్‌నగర్‌లో) ప్రారంభించారని, రేషన్ కార్డులను పుట్టినింటిలో (తుంగతుర్తి నియోజకవర్గంలో) ప్రారంభించేలా చేశారని పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి
– ఎమ్మెల్యే మందుల సామేల్
తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని, సమస్యలు పరిష్కరించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో 13 గ్రామాలకు దేవాదుల ద్వారా గోదావరి జలాలు అందివ్వాలని, ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలు అసంపూర్తిగా ఉన్నాయని, లైనింగ్ చేయాలని, పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు.
సామేల్‌కు హితబోధ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మందుల సామెల్ రూ.50 వేలతో వస్తే.. నియోజకవర్గ ప్రజలు 60 వేల మెజార్టీతో గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వారిని గుండెల్లో పెట్టుకుని ఎమ్మెల్యేను చేసిండ్రు. అందుకే వారి మంచి చెడుల్లో పాలుపంచుకోవాలి. సోనియాను నమ్మి గెలిపించారు. కడుపులో పెట్టుకోవాలి. ఒకరికి బాధ ఉంటది, ఒకరికి దుఃఖం ఉంటది, ఒకరికి కోపం ఉంటది. ఒకరికి ఆలోచన ఉంటది. మరొకరి ఆశ ఉంటంది.. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా నువ్వే ఓపికతో అన్నీ ఆలోచించి అందరినీ కలుపుకుపోవాలి. ఏదేనా సమస్య ఉంటే ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అవసరమైతే నా దృష్టికి తీసుకురండి మీ సమస్య పరిష్కరిస్తానన్నారు. రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్సీలకు అవకాశం వస్తే అందులో నల్లగొండ జిల్లాకే ముగ్గురికి ఇచ్చాను. పీసీసీ అధ్యక్షుడు కూడా నల్లగొండ కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించాలన్నారు. ఇక్కడి ప్రజలకు కోపం వస్తే దాచుకోరని, గట్టిగా కోపంగా మాట్లాడతారని, అయితే, వివరించి చెబితే వింటారని, తనకు ఆ విశ్వాసం ఉందన్నారు. కార్యకర్తలను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం అన్నారు.
టార్గెట్.. జగదీష్‌రెడ్డి
ఫ గంజాయి మొక్కతో పోల్చిన సీఎం
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని టార్గెట్ చేసుకొని తిరులమగిరి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘సూర్యాపేటలో ఉన్న మూడడుగులాయన ఈ సభకు సీఎం ఎట్ల వస్తరని అంటున్నరు. కేసీఆర్ ఉంటే గోదావరి జలాలు మూడు రోజులలో తీసుకువస్తానని అంటున్నరు. మరి పదేళ్లు ఎందుకు తేలేకపోయారు’ అని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. గోదావరి జలాలు తేవడమంటే మందులో సోడా కలిపినట్లు కాదన్నారు. ‘పదేళ్లు దొరగారి దగ్గర ఫామ్‌హౌస్‌లో గడ్డి పీకావా.. పదేళ్లలో ఒక్కనాడైనా ఆలోచించావా’ అని ప్రశ్నించారు. ‘మీ ఊరును మండలం చేశావు. మండలానికి అధికారులను తెచ్చుకున్నవు. మీ మండలానికి ఎంఆర్‌వో ఆఫీస్, పోలీస్ స్టేషన్ కూడా కట్టించుకోలేదు. వాటికి మా మందుల సామేల్ స్థలాన్ని ఇప్పించి కట్టిస్తున్నడు’ అని అన్నారు. తన ఊరికి ఏం చేయలేని ఆయన ముఖ్యమంత్రిని అడ్డుకుంటాడట. కాంగ్రెస్ కార్యకర్తలే ఆయన్ను చూసుకోవాలన్నారు. మా దామన్న ఒక్కడు చాలు. వారి కథకమామిషు ఏందో చూసుకుంటారని అన్నారు. ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఇంకా వారి గురించి ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. పదేళ్లు మంత్రిగా చేసిన ఆయన మొన్న ఎన్నికల్లో తులసి వనంలో గంజాయి మొక్కలా ఒక్కడే గెలిచిండు. ఆ మొక్కను కూడా వచ్చే ఎన్నికల్లో కూకటి వేళ్లతో పీకేయాలన్నారు.

పోరుగడ్డకు అండగా ఉంటాం..

పోరుగడ్డకు అండగా ఉంటాం..

పోరుగడ్డకు అండగా ఉంటాం..

పోరుగడ్డకు అండగా ఉంటాం..

పోరుగడ్డకు అండగా ఉంటాం..

పోరుగడ్డకు అండగా ఉంటాం..

పోరుగడ్డకు అండగా ఉంటాం..