
నిర్ణయించిన ధరకే ఇవ్వాలి
భువనగిరిటౌన్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే అమ్మాలని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఇటుక బట్టీలు, స్టోన్‌క్రషర్ల యజమానులు, ఇసుక, సిమెంట్ డీలర్లు, మేసీ్త్రలు, స్టీల్, ఐరన్ దుకాణాల నిర్వాహకులతో సమావేశం ఏర్పా టు చేసి ధరలపై సమీక్షించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ప్రభుత్వం చెప్పిన ధరకు అమ్మాలని, అవసరమైతే ఆర్థికంగా లేని లబ్ధిదారులకు ఉద్దెర ఇచ్చి సహకరించాలని కోరారు. నిర్మాణ కూలి వీలైనంత తక్కువగా తీసుకోవాలని మేసీ్త్రలకు సూచించారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, మైనింగ్ ఏడీ పాల్గొన్నారు.
శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వాఅర్చనతో పాటు ఆలయ ముఖమండపంలోని స్పటిక లింగానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం,గజ వాహన సేవ, అమ్మవారి నిత్యకల్యాణం, జోడు సేవ నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : 2025–26 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఈనెల 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంఈఓలు, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ నెల 20వ తేది ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవడానికి చివరి గడువుగా ఉందన్నారు. దరఖాస్తు ప్రతులను ఎంఈఓ ద్వారా డీ ఈఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
16న మత్స్యగిరిలో వేలం పాటలు
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివిధ దుకాణాల నిర్వహణ, స్వా మివారి నిత్యకై ంకర్యాలకు పూజా సామగ్రి సమకూర్చుటకు ఈనెల 16న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మోహన్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 5,18,28 తేదీల్లో వేలం నిర్వహించగా వివిధ కారణాల వల్ల వాయిదాపడినట్లు పేర్కొన్నారు. అసక్తి, అర్హత కలిగిన కాంట్రాక్టర్లు టెండర్ కం వేలంలో పాల్గొనాలని కోరారు.
ఆలేరులో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్
ఆలేరు: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆలేరు పట్టణంలో పోలీసులు సోమవారం సాయంత్రం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. శ్రీకనకదుర్గ దేవాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు, దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సీఐ కొండల్‌రావు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజాపేట, గుండాల,ఆలేరు ఎస్‌ఐలు అనిల్, సైదులు, వినయ్‌తోపాటు వందమంది ఆర్ముడ్ రిజ్వర్డు పోలీసులు పాల్గొన్నారు.

నిర్ణయించిన ధరకే ఇవ్వాలి