
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చిట్యాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. చిట్యాల ఏఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం ఇస్మాయిన్‌పల్లి గ్రామానికి చెందిన మాద నర్సింహ(50) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు ఈ నెల 10వ తేదీన పని నిమిత్తం బైక్‌పై మునుగోడుకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో చిట్యాల మండలం ఎలికట్టె గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వచ్చిన గూడ్స్ వాహనం నర్సింహ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింహను హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఆదివారం మృతుడి కుమారుడు హరిక్రిష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి..
మఠంపల్లి: మఠంపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి సాముల కోటిరెడ్డి(45) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కోటిరెడ్డి 22ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసి ఇటీవల రిటైర్డ్ అయ్యారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆటో బోల్తా.. యువకుడి మృతి
పెన్‌పహాడ్: ఆటో బోల్తాపడి గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన తండ సైదులు(29) ప్లంబర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం శనివారం సూర్యాపేటకు వెళ్లి ఆటోలో తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. అనంతారం గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ సమీర్ రోడ్డుపై గేదెలను తప్పించబోయే క్రమంలో ఆటో బోల్తా పడింది. సైదులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు సైదులు కళ్లను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో..
చిట్యాల: ఇంట్లో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చిట్యాల మండలం వెలిమినేడులో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన లక్ష్మారెడ్డి వెలిమినేడు గ్రామంలో రాంకీ సంస్థకు చెందిన భూములను పర్యవేక్షిస్తూ గ్రామంలో ఒక్కడే నివాసముంటున్నాడు. ఆదివారం ఉదయం లక్ష్మారెడ్డి ఇంట్లో ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. చుట్టుపక్కల వారు గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.