
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వలిగొండ: వలిగొండ మండలం ఎం.తుర్కపల్లిలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎం. తుర్కపల్లి గ్రామానికి చెందిన మాసంపల్లి శ్రీశైలం(45) ఆదివారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండడాన్ని బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తల వెనుక, ఎడమ కంటిపై భాగంలో గాయాలను గుర్తించినట్లు తెలిపారు. శ్రీశైలం భార్య, కుమారుడు బంధువుల దశదిన కర్మకు వెళ్లగా.. వారికి సమాచారం ఇవ్వడంతో వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
జాల గ్రామంలో..
రాజాపేట: రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన వ్యక్తి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జాల గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (55) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ఇంట్లో ఒక్కడే నివాసముంటున్నాడు. పాముకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని కాశగూడేనికి చెందిన వ్యక్తి పని కోసం ఇస్మాయిల్‌ను తీసుకువెళ్దామని ఆదివారం ఉదయం అతడి ఇంటి వద్దకు వచ్చి ఎంత పిలిచినా పలకలేదు. దీంతో కిటికీ లోంచి ఇంట్లోకి తొంగి చూడగా ఇస్మాయిల్ మృతిచెంది ఉన్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో మూడు రోజుల క్రితమే ఇస్మాయిల్ మృతిచెంది ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.